కరోనా... కంగారు పడకండి | Sakshi
Sakshi News home page

కరోనా... కంగారు పడకండి

Published Mon, Mar 16 2020 12:56 PM

COVID19 Effect Person Shifted to Kakinada GGH - Sakshi

కరోనా వైరస్‌ సోకిందేమోనని కొందరికి వైద్య పరీక్షలు చేస్తున్నందున ఎవరూ కంగారు పడవద్దని వైద్యాధికారులు ధైర్యం చెబుతున్నారు. ఇంతవరకు జిల్లాలో కొంతమందికి వైద్య పరీక్షలు చేశామని, అయితే వారికి కరోనా వైరస్‌ సోకినట్టు ధ్రువీకరణ కాలేదని అంటున్నారు. జిల్లాలో ఆదివారం ముగ్గురికి  వైరస్‌ లక్షణాలున్నట్టు ప్రచారం సాగింది. వారికి అధికారులు వైద్య పరీక్షలు చేసి పర్యవేక్షణలో ఉంచారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తరువాత పరిస్థితి ఏమిటనేది తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు.

తూర్పుగోదావరి, రాజానగరం: దుబాయ్‌ నుంచి కొండగుంటూరు వచ్చిన బీమన నూకరాజు (22)కు జలుబు చేయడంతో అతడిని ఆదివారం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. రాజానగరం పీహెచ్‌సీ వైద్యాధికారి టి.రవికుమార్‌ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఆ గ్రామంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఆకుల రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ వంలంటీర్లతో ఏర్పడిన రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ద్వారా ఇంటింటా తిరిగి కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నూకరాజు ఇంటిని పైకప్పుతో సహా పూర్తిగా బ్లీచింగ్‌తో స్ప్రే చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూచనల మేరకు సుమారు మూడు కిలోమీటర్ల వరకు హైపో క్లోరినేషన్‌ చేశారు. ఇటీవల మండలంలో నిర్వహించిన సర్వే మేరకు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి మండలానికి వచ్చిన 18 మందిని గుర్తించి వారికి ఆరోగ్య పరీక్షలు కూడా చేశారు. 

అనుమానితుడిని కాకినాడ తరలింపు  
రాజోలు: కువైట్‌లోని కెనాడైల్‌ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ మీదుగా ఈ నెల 14వ తేదీన వచ్చిన కడలి గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి జ్వరం, దగ్గు ఎక్కువగా ఉండడంతో అతడి కుటుంబీకులు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించి పీహెచ్‌సీ వైద్య సిబ్బంది వివరాలు సేకరించింది. ప్రత్యేక అంబులెన్స్‌లో అతనిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామని తాటిపాక పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రశాంత్‌ తెలిపారు. అయితే అనుమానితుడి వైద్య పరీక్షల రిపోర్టులు ఇంకా రాలేదన్నారు. 

రాజమహేంద్రవరంలో..  
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలోని దానవాయిపేటకు చెందిన ఎన్‌.రాజీవ్‌రెడ్డికి జలుబు, దగ్గు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన నుంచి త్రోట్‌ స్వాబ్‌ సేకరించారు. అతడి పరిస్థితిని వైద్యులు వాకబు చేసి తగిన పరీక్షలు చేశారు.

పేరూరులో ఒక వ్యక్తికి..  
అమలాపురం రూరల్‌: దుబాయ్‌ నుంచి పేరూరు వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిని పేరూరు పీహెచ్‌సీ వైద్యులు ఆదివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతడికి కాకినాడలో ఐసోలేషన్‌ వార్డులో చేర్పించి వైద్య నిర్థారణ పరీక్షలు చేసినట్టు వైద్యాధికారిణి ఎం.శాంతి లక్ష్మి తెలిపారు.  

Advertisement
Advertisement