850 బిలియన్‌ డాలర్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ | Sakshi
Sakshi News home page

850 బిలియన్‌ డాలర్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

Published Thu, Sep 26 2019 4:12 AM

AP State economy To 850 billions says Buggana Rajendranath - Sakshi

సాక్షి, అమరావతి:  వచ్చే 15 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 135 బిలియన్‌ డాలర్ల నుంచి 850 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. ఇందుకోసం కీలకమైన మౌలిక వసతులు లాజిస్టిక్స్, రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. బుధవారం విజయవాడలో ఫ్రాన్స్‌ ప్రతినిధుల బృందంతో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తల రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ... ప్రస్తుతం దేశ జీడీపీలో ఆంధ్రప్రదేశ్‌ వాటా 5 శాతంగా ఉందని, దీన్ని 2034 నాటికి 7 శాతానికి పెంచాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా,, ఎనర్జీ, ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి క్లస్టర్స్‌ అభివృద్ధి చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఫ్రాన్స్‌ ప్రతినిధి బృందాన్ని బుగ్గన కోరారు.  

మానవ వనరుల అభివృద్ధికి జీడీపీలో 10 శాతం నిధులు  
రాష్ట్ర ప్రగతితో పాటు మానవ వనరుల అభివృద్ధిపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. 2030లోగా సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీఎస్‌) చేరుకోవడానికి మానవ వనరుల అభివృద్ధికి రాష్ట్ర జీడీపీలో ఏటా 10 శాతం నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.  సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్‌ మాట్లాడుతూ... వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ఐటీ సర్వీసుల వాటాను 40 నుంచి 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్, ఆటోమొబైల్, ఫుడ్‌ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రా రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్‌ ప్రతినిధుల బృందం ఆసక్తి వ్యక్తం చేసింది.

ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఫ్రాన్స్‌కు చెందిన వికా సిమెంట్‌ చైర్మన్‌ గై సిడోస్‌ నేతృత్వంలోని 16 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఈ బృందం గురువారం సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ కానుంది. పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకునేందుకు సీఐఐ, ఈడీబీ, ఫ్రాన్స్‌ బృందంతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు.  

Advertisement
Advertisement