ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

Published Sat, Jun 15 2024 11:42 PM | Last Updated on Sat, Jun 15 2024 11:42 PM

ఇసుక

సిద్దవటం : పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా అడ్డుకట్ట వేశామని సిద్దవటం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో స్టేషన్‌ సీఐ నాగరాజు తెలిపారు. డేగనవాండ్లపల్లె గ్రామం వద్ద పెన్నానదిలోకి వెళ్లే రహదారిలో శనివారం జేసీబీ యంత్రంతో గోతులు తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలంలోని డేగనవాండ్లపల్లె గ్రామ సమీపంలోని పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తూ వేల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇసుక రవాణాపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఇసుక రవాణా జరగకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వో చంద్ర, రెవెన్యూ సిబ్బంది, ఎన్‌ఫోర్స్‌మెంటు సిబ్బంది పాల్గొన్నారు.

కంప చెట్లలో గుర్తుతెలియని మృతదేహం

చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని మామిళ్ళపల్లె పంచాయతీ సమీపంలో గల సోమయాజులపల్లి గ్రామం వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఏఎస్‌ఐ నాగరాజు శనివారం తెలిపారు. సోమయాజులపల్లి గ్రామానికి ఉత్తరం వైపున కంప చెట్లలో అనుమానాస్పదంగా ఉన్న మృతదేహాన్ని పశువుల కాపర్లు గుర్తించి తమకు సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు చెప్పారు. మృతుడు కాఫీ రంగు లుంగిపై సబ్బురంగు చుక్కల డిజైన్‌తోపాటు మెరూన్‌ రెడ్‌ ఫుల్‌ షర్టు, బ్లూ రంగు గల ఫుల్‌ డ్రాయర్‌తో ఉన్నాడని తెలిపారు. అతని వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని వివరించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని టి.చదిపిరాళ్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో చింతకుంట ప్రసాద్‌ (44) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముద్దనూరు మండలం ఒంటిగారిపల్లెకు చెందిన ప్రసాద్‌ కడపలోని అక్కాయపల్లెలో నివాసం ఉంటూ కడప నగర పాలక సంస్థలో పీహెచ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ప్రసాద్‌ తన మోటార్‌ బైక్‌లో ఎర్రగుంట్ల వైపు నుంచి కడప వైపు వెళ్తున్న క్రమంలో చదిపిరాళ్ల వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న సత్యం అనే వ్యక్తిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో ప్రసాద్‌ కింద పడ్డాడు. ముఖానికి బలమైన గాయం అయింది. అలాగే సత్యంకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కమలాపురం 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ప్రసాద్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా ప్రసాద్‌కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సత్యం అనే వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు వివరించారు.

విద్యుత్‌ ఘాతంతో..

ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని ముదినేపల్లి గ్రామ సమీపంలో శనివారం విద్యుత్‌ తీగలు తగిలి గేదె మృతి చెందింది. కటికంవారిపల్లి గ్రామానికి చెందిన అరిగెల వెంకటయ్య రోజూ గేదెలను తోలుకుని వెళ్లి ముదినేపల్లి గ్రామం పై పక్క ఉన్న పంట పొలాలలో మేపుతుండే వాడు. ఈ క్రమంలో శనివారం గాలేరు–నగిరి మట్టికట్టపై గేదెలు వెళ్లడంతో విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే ఒక గేదె మృతి చెందింది.

కురబలకోటలో చోరీ

కురబలకోట : మండల కేంద్రం కురబలకోటలో పి.శ్రీనివాసులు ఇంటిలో 42 గ్రాముల బంగారు నగలు చోరీకి గురైనట్లు శనివారం ముదివేడు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధిత కుటుంబీకులు రెండు రోజుల క్రితం మదనపల్లెలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం వచ్చి చూస్తే ఇంటి బీరువాలోని నగలు కన్పించలేదని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి వెనుక నుంచి వచ్చి ఈ చోరీ చేసినట్లు చెబుతున్నారు. క్లూస్‌ టీం నమునాలు సేకరించింది. రూరల్‌ సర్కిల్‌ సీఐ సద్గురుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట  1
1/3

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట  2
2/3

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట  3
3/3

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement