Sakshi News home page

రామా.. కరుణజూపుమా

Published Sat, Apr 20 2024 2:00 AM

గ్రామోత్సవంలో భక్తులకు అభయమిస్తున్న వటపత్రశాయి     అలరిస్తున్న కోలాట ప్రదర్శన   - Sakshi

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు జరిగింది.భక్త బృందాల భజనలు, కళాకారుల కోలాటా నడుమ స్వామివారు పురవీధుల్లో విహరించారు. గ్రామోత్సవం అనంతరం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనే, చందనంతో శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో సోమరితం నశించి, పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను , నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామి వారు నిరూపిస్తున్నారు. ఒంటిమిట్ట ఆలయ డిప్యూటి ఈఓ నటేష్‌ బాబు ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శనివారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో జగదభిరాముడు భక్తులకు దర్శనమిస్తారు. 7 నుంచి 9 గంటల వరకు పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 11 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9:00 గంటలకు హనుమంత వాహనం సేవ ఉంటుంది. వాహనసేవల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కోలాటాలు, కేరళ వాయిద్యాలు, తాళం భజన ప్రదర్శనలు ఉంటాయి.

వటపత్రశాయిగా దాశరథి దర్శనం

మూడోరోజు చూడ ముచ్చటగా సీతాపతి బ్రహ్మోత్సవం

Advertisement
Advertisement