రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు | Sakshi
Sakshi News home page

రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు

Published Sat, May 25 2024 1:25 PM

రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు

ఖిలా వరంగల్‌: ప్రభుత్వం సబ్సిడీపై జీలుగ విత్తనాలను అందిస్తోంది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. సేంద్రియ పద్ధతిని ప్రోత్సహిస్తూ వరి పంట అధిక దిగుబడి వచ్చేందుకు వ్యవసాయశాఖ పంపిణీ చేస్తోంది. ఏకవార్షిక మొక్కల్లో ప్రథమ స్థానం జీలుగదే. విత్తనాలు విత్తిన 30 నుంచి 35 రోజుల్లో మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దుక్కిలో 30 కిలోల యూరియా వేసిన తర్వాత ఎకరానికి 12 కిలోల జీలుగ విత్తనాలు చల్లుకోవాలి. 30 రోజుల్లో ఏపుగా పెరిగి పూత దశకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించాలి. లేనిపక్షంలో రోటోవేటర్‌ సాయంతో పొలం అంతా కలియదున్నాలి. దున్నిన అనంతరం 100 కిలోల సింగిల్‌ సూపర్‌ పాస్ఫేట్‌ ఎరువును దుక్కిలో వేస్తే మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది. పొలంలో జీలుగ కుళ్లే దశలో నీటిని సక్రమంగా అందించాలి.

60 శాతం రాయితీపై పంపిణీ..

జిల్లాకు 1,246 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా అయ్యాయి. ప్రభుత్వ 60 శాతం రాయితీపై ఇస్తోంది. జీలుగ క్వింటాలు ధర రూ.9,300 కాగా.. రూ.5,580 రాయితీ తీసివేస్తే రైతు రూ.3,720 చెల్లించాల్సి ఉంటుంది. జీలుగ 30 కిలోల బస్తాకు 60 శాతం రాయితీ తీసివేస్తే రైతు రూ.116 చెల్లించాలి. 30 కిలోలు రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి సరిపోతుంది.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం 60 శాతం రాయితీపై పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందిస్తోంది. 1,246 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు మండల కేంద్రాల్లోని పీఏసీఎస్‌లలో అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

డి.ఉషాదయాళ్‌,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాకు 1,246 క్వింటాళ్ల జీలుగ సీడ్స్‌

Advertisement
 
Advertisement
 
Advertisement