జిల్లాకు గులాబీ దళపతి | Sakshi
Sakshi News home page

జిల్లాకు గులాబీ దళపతి

Published Wed, Nov 22 2023 4:24 AM

తాండూరు: సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి - Sakshi

నేడు, రేపు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటన

భారీ జన సమీకరణలో అభ్యర్థులు

హామీలపై సర్వత్రా ఆసక్తి

తాండూరు/పరిగి/వికారాబాద్‌: జిల్లాలోని తాండూరు, కొడంగల్‌, పరిగి నియోజవకర్గాల్లో బుధవారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం వరకు సీఎం పర్యటన కొనసాగనుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రోహిత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మహేష్‌రెడ్డి మంగళవారం సభా ప్రాంగణాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. తాండూరులోని విలియంమూన్‌ పాఠశాల మైదానంలో ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్‌ మొదటి సభ ప్రారంభం కానుంది. సభకు హజయ్యే వారికి తాగునీరు, తదితర సౌకర్యాలను సమకూరుస్తున్నారు. సభకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి లక్ష మంది జన సమీకరణ చేయాలని ప్రణాళిక రచించారు. నేడు జరగనున్న సభలో కంది బోర్డు విషయంలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనంతరం కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో నిర్వహించే భహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించే భహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

ఏర్పాట్ల పరిశీలన..

పరిగిలో సీఎం కేసీఆర్‌ హాజరయ్యే ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొడంగల్‌ రోడ్డు జింఖానా గ్రౌండ్‌లో సభావేదికను మంగళవారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిశీలించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సభా స్థలాన్ని పరిశీలించి బందోబస్తుపై సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వస్తుండటంతో తుంకుల్‌గడ్డ సమీపంలో హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. హెలిపాడ్‌ స్థలం నుంచి నేరుగా ఎలాంటి ట్రాఫిక్‌ లేకుండా 2 కిలోమీటర్ల మేర సీఎం సభా స్థలానికి రావడానికి ఏర్పట్లు చేశారు. సీఎం సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

రేపు వికారాబాద్‌లో..

వికారాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. రెండు రోజులు వరుసగా జిల్లాలో గులాబీ బాస్‌ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పర్యటనలను అధికార పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో సమావేశానికి 50వేల నుండి 60వేల వరకు జన సమీకరణ చేపట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకు ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు.

Advertisement
Advertisement