● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్‌ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం | Sakshi
Sakshi News home page

● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్‌ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

Published Sat, May 25 2024 1:11 AM

-

తిరుపతి అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల ఫలితాలపై అందరికీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఓట్ల లెక్కింపునకు మరో పదిరోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రజానీకం సైతం జూన్‌ 4వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హోరాహోరీగా తలపడిన అభ్యర్థులు తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓట్ల శాతంపై లెక్కలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు.. అభిమానులు సహకరించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. మీడియా ద్వారా ప్రకటనలు విడుదల చేస్తున్నారు.

ఆధిక్యంపై లెక్కలు

సార్వత్రిక ఎన్నికల్లో 85 ఏళ్లు దాటి ఇంటికే పరిమితమైనన 583 మంది ఓటర్లు హోమ్‌ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఇంటికే పరిమితమైన దివ్యాంగులు 485 మంది సైతం హోమ్‌ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు 20,153 మంది సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు ఈవీఎంల ద్వారా అసెంబ్లీకి 14,25,477 మంది ఓటర్లు, పార్లమెంట్‌కు 13,68,324 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వాడుకున్నారు. వీరిలో ఎవరికి ఎక్కువ మంది ఓటేశారు. ఏపార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి. ఏ నియోజకవర్గలో ఎవరికి ఎంత ఆధిక్యం వచ్చే అవకాశముందని జనం చర్చించుకుంటున్నారు.

అందరి చూపు పోస్టల్‌ బ్యాలెట్‌ పైనే..

ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులతోపాటు అత్యవస సేవలను అందించే వివిధ విభాగాల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో 20,153 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో 20శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వివిధ కారణాలతో చెల్లుబాటు కాలేదు. ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయడానికి గెజిటెడ్‌ అధికారి సంతకం ఉంటేనే బ్యాలెట్‌ ఓటు చెల్లుతుంది. ఈ క్రమంలో పలువురు గెజిటెడ్‌ అధికారి సంతకం లేకుండా వేశారనే చర్చ సాగుతోంది. ఈ అంశంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తరుణంలో అన్ని కోణాల నుంచి లెక్కలు వేస్తున్నారు. మొత్తంగా కౌంటింగ్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఫలితాలపై చర్చ జోరుగా సాగుతోంది.

కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు (ఫైల్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement