పరందూరుకు మెట్రో | Sakshi
Sakshi News home page

పరందూరుకు మెట్రో

Published Tue, Apr 23 2024 8:30 AM

పరందూరు విమానాశ్రయం నమూనా 
 - Sakshi

● పూందమల్లి నుంచి విస్తరణ పనులు ● నివేదిక రెడీ ● 19 రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం

సాక్షి, చైన్నె : పూందమల్లి నుంచి పరందూరుకు మెట్రో రైలు పనులకు సంబంధించిన నివేదిక తాజాగా సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 10,712 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మొత్తం 43.66 కి.మీ దూరం ఏర్పాటు చేసే మెట్రో రైలు మార్గంలో 19 రైల్వే స్లేషన్లు నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. వివరాలు.. చైన్నెలో ప్రస్తుతం ఫేజ్‌ –1 పనులు ముగియడంతో రెండు మార్గాలలో మెట్రో రైలు సేవలకు విపరీతమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఫేజ్‌– 2లో మరో మూడు మార్గాలలో పనులకు కార్యాచరణ సిద్ధం చేశారు. రూ. 63, 246 కోట్లతో 118.9 కి.మీ దూరం లైట్‌ హౌస్‌ – పూందమల్లి మధ్య 26.1 కి.మీ, మాధవరం – సిరుచ్చేరి సిప్‌కాట్‌ మధ్య 45.8 కి.మీ, మాధవరం నుంచి షోళింగనల్లూరు వరకు 47 కి.మీ దూరం మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గలలో అత్యధిక దూరం రైలు భూగర్భ మార్గంలోనే పయనించనుంది. ఈ పరిస్థితులలో పూందమల్లి వరకు ఉన్న మెట్రో సేవను పరందూరు వరకు విస్తరించేందుకు కార్యాచరణను రూపొందించారు.

కొత్త విమానాశ్రయం వరకు ..

చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో పెరిగిన రద్దీతో మరో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం కాంచీపురం జిల్లా పరిధిలోని పరందూరును ఎంపిక చేశారు. చైన్నె నుంచి 60 కి.మీ దూరంలోని పరందూరులో 4,798 ఎకరాల స్థలంలో రూ. 40 వేల కోట్లతో పనులు చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఏకనాపురం వేదికగా 13 గ్రామాల ప్రజలు ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వీరంతా లోక్‌ సభ ఎన్నికలను సైతం బహిష్కరించారు. ఈ పరిస్థితులలో కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ రూపుదిద్దుకునే పరందూరుకు మెట్రో రైలు సేవలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత టెండర్ల ప్రక్రి యపై దృష్టి పెట్టాలని మెట్రో వర్గాలు నిర్ణయించాయి.

అంచనా వ్యయంగా రూ. 10,712 కోట్లు

పూందమల్లి – పరందూరు మధ్య మెట్రో రైలు పనులకు రూ. 10,712 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 43.66 కి.మీ దూరం వంతెన మార్గంలో పనులు చేపట్టబోతున్నారు. ఈ మార్గంలో 19 రైల్వే స్టేషన్లు, మల్లీ లెవల్‌ పార్కింగ్‌ సెంటర్లు, మాల్స్‌ తదితర నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సమగ్ర నివేదికలో పొందు పరిచారు. చైన్నె నగరంలో సగటున కి.మీ లేదా 1.5 కి.మీ దూరానికి ఒక మెట్రో రైల్వే స్టేషన్‌ ఉన్నాయి. అయితే పూందమల్లి – పరందూరు మార్గంలో కొన్ని చోట్ల రెండు, మరికొన్ని చోట్ల మూడు కి.మీ దూరానికి ఓ రైల్వే స్టేషన్‌ ఏర్పాటు కానుంది. రైలు అతి వేగంగా విమానాశ్రయం వైపుగా దూసుకెళ్లే విధంగా దూరాన్ని పెంచి రైల్వే స్టేషన్ల ఏర్పాటు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు పూందమల్లి, నషరత్‌ పేట చెక్‌ పోస్టు, చెంబరంబాక్కం, తిరుమలిసై టౌన్‌షిప్‌, పాపన్‌ చత్రం, చెట్టి పేడు, తండలం, ఇరుంగాట్టు కోట్టై, పొన్నలూరు, శ్రీపెరంబదూరు, పట్టునూల్‌ చత్రం, ఇరుంకులం పారిశ్రామిక వాడ, మాంబాక్కం, తిరుమంగళం, సుంకువారి చత్రం, సంత వేలూరు, పిల్‌లై చత్రం, నీర్వల్లూరు, పరందూరులలో రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఈ నివేదికలో వివరాలను పొందు పరిచారు.

మెట్రో రైలు
1/1

మెట్రో రైలు

Advertisement
Advertisement