Sakshi News home page

నేటితో ప్రచారానికి తెర

Published Wed, Apr 17 2024 12:30 AM

బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న తమిళిసై, సుధాకర్‌రెడ్డి  - Sakshi

సాక్షి, చైన్నె: లోక్‌సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ఆరు గంటలతో ముగియనుంది. ఆ తదుపరి అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధిస్తూ, కొత్త మార్గదర్శకాలను ఎన్నికల ప్రధాన అధికారి సత్య ప్రద సాహూ మంగళవారం విడుదల చేశారు. ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివరాలు.. లోక్‌సభ ఎన్నికకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కానుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగించాల్సి ఉంది. దీంతో మంగళవారం ఆఘమేఘాలపై ఓట్ల వేట సాగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రామనాథపురంలో మాజీ సీఎం పన్నీరుకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కృష్ణగిరిలో ప్రచారం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తాను పోటీ చేస్తున్న కోవైలో సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అన్నాడీఎంకే దక్షిణ చైన్నె అభ్యర్థి జయవర్ధన్‌, కూటమిలోని సెంట్రల్‌ చైన్నె డీఎండీకే అభ్యర్థి పార్ధసారథికి మద్దతుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఓట్ల వేటలో దూసుకెళ్లారు. డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా యువజన నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఈరోడ్‌, పొల్లాచ్చిలో పర్యటించారు. ఎండీఎంకే నేత వైగో మేట్టుపాళయం, కోయంబత్తూరులో ఓపెన్‌ టాప్‌ వాహనంలో వీధి వీధిన దూసుకెళ్లారు. మదురైలో సీపీఎం నేత బాలకృష్ణన్‌, కడలాడిలో సీపీఐ నేత ముత్తరసన్‌ ప్రచారం చేశారు. డీఎండీకే ప్రేమలత విజయకాంత్‌ ఒకే రోజున మదురై, తెన్‌కాశి, విరుదునగర్‌లో ఆగమేఘాలపై ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. తంజావూరు, తిరుచ్చిలో తమిళమానిల కాంగ్రెస్‌ నేత జీకేవాసన్‌, కాంచీపురం, ఆరణి, విల్లుపురం, పుదుచ్చేరిలో నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ ప్రచారం చేశారు. డీఎంకే కూటమికి మద్దతుగా శ్రీపెరందూరులో విశ్వనటుడు కమల్‌ ప్రచారం జరిగింది. ఇక, తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెలోని పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించారు. దక్షిణ చైన్నె అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి ఆ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు

కొన్ని గంటలలో..

ప్రచారం పరి సమాప్తం కావడానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కడికక్కడ గప్‌చుప్‌ అన్నట్టుగా పరిస్థితి మారనుంది. ఆరు గంటల తర్వాత ఎన్నికల యంత్రాంగం రంగంలోకి దిగి కొరడా ఝుళిపించనుంది. ఇందుకు సంబంధించిన ఆంక్షలు, మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రదసాహూ వివరించారు. బయటి వ్యక్తులు ఏ ఒక్కరూ నియోజకవర్గాలలో ఉండేందుకు వీలు లేదని, ఖాళీ చేసి వెళ్లి పోవాలని ఆదేశించారు. ఎలాంటి మార్గాలలో ప్రచారాలకు వీలు లేదని వివరించారు. ఎన్నికల రోజున అనుమతి పొందిన వాహనాలలో మాత్రమే అభ్యర్థులు, ఏజెంట్లు పర్యటించాలని సూచించారు. ఓటర్లను వాహనాల్లో తరలిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి ఉపేక్షించ వద్దు అని కఠినంగా వ్యవహరించాలని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసులు తదితర సిబ్బంది తపాల్‌ ఓట్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రంతో ముగిసిందని ఎన్నికల ప్రధాన అధికారి సాహూ వివరించారు. అలాగే 85 ఏళ్లు పైబడ్డ వారు 66,421 మంది, దివ్యాంగులు 40971 మంది తపాల్‌ ఓట్లను నమోదు చేసినట్టు, ఈ ప్రకియ 18వ తేదీ సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. శ్రీపెరంబదూరు సమీపంలోని రూ. 950 కోట్లు విలువైన 1,425 కేజీల బంగారానికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను సంబంధిత సంస్థ సమర్పించడంతో వాటిని వెనక్కి అప్పగించామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ. 1,284 కోట్లు విలువైన నగదు, బంగారు ఆభరణాలు, తదితర వస్తువులు బయట పడ్డాయని, ఇందులో రూ. 950 కోట్లు విలువైన బంగారం కూడా ఉందన్నారు. ఈ బంగారం వెనకి అప్పగించామనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. అనుమతి లేకుండా పత్రికలలో బీజేపీ ఇచ్చిన ప్రకటనపై విచారణకు ఆదేశించామన్నారు. బూత్‌ స్లిప్పులతో పాటు డీఎంకే నగదునూ పంచుతోన్నట్టుగా వచ్చిన ఫిర్యా దుపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

మార్గదర్శకాలు విడుదల నిబంధనలు ఉల్లంఘిస్తే

కఠిన చర్యలు : సాహూ హెచ్చరిక

Advertisement
Advertisement