తప్పించుకోలేరు! | Sakshi
Sakshi News home page

తప్పించుకోలేరు!

Published Tue, Nov 21 2023 12:30 AM

చిన్నారి లక్షితను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఎస్పీ మాధవ రెడ్డి (ఫైల్‌) - Sakshi

● పుట్టపర్తిలోని మోర్‌ షాపింగ్‌ మాల్‌ వద్ద ఆడుకుంటున్న లక్షితశ్రీ (5)ని ఈనెల 12వ తేదీ సాయంత్రం ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ విషయం పసిగట్టారు. ముమ్మర గాలింపు చేపట్టారు. భయపడిన దుండగుడు చిన్నారిని సాయిబాబా మందిరంలో వదిలి వెళ్లాడు. మరుసటి రోజే నిందితుడు సాయికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించారు.

● ఓడీ చెరువులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులు ఈనెల 6న అదృశ్యమయ్యారు. పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ ఫిర్యాదు మేరకు డీఎస్పీ వాసుదేవన్‌ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బెంగళూరులో శివాజీనగరలో ఉన్నట్లు తేలింది. పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుకొచ్చారు. ఈనెల 13న ఎస్పీ మాధవ్‌రెడ్డి సమక్షంలో పిల్లలను తల్లిదండ్రులకు అప్పజెప్పారు.

● కదిరి పట్టణంలోని బేరిపల్లి క్వార్టర్స్‌కు చెందిన కృష్ణమూర్తి కుమార్తె వందన ఈనెల 3న కనిపించుకుండా పోయింది. కదిరి వ్యవసాయ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న వందన డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి కేసును ఛేదించారు.

సాక్షి, పుట్టపర్తి: సాంకేతికతను జిల్లా పోలీసులు సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. అదృశ్యం లేదా కిడ్నాప్‌ కేసులను సులువుగా పరిష్కస్తున్నారు. దుండగులను వెంటాడి మరీ పట్టుకుంటున్నారు. తప్పిపోయిన వారు ఎక్కడున్నా వదలడం లేదు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలు ప్రధాన ఆయుధాలుగా పనిచేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా రాత్రివేళల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ పకడ్బందీగా వ్యవహరిస్తుండడం కూడా కలిసొస్తోంది.

కారణాలెన్నో..

అదృశ్యం లేదా కిడ్నాప్‌నకు పలు కారణాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నారులను కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేసి నగదు ముట్టిన తర్వాత వదిలేస్తున్నారు. మరో కోణంలో యువతులను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేయడంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు ప్రేమ వ్యవహారం కారణంగా అదృశ్యమై జంటలుగా తిరిగి వస్తున్నారు. ఇంకొన్ని చోట్ల వృద్ధాప్యంలో పోషణ భారమై సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కొందరు బుద్ధిమాంద్యం కారణంగా ప్రాంతాల వారీగా సంచరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2021 కంటే 2022లో మిస్సింగ్‌ కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2023లో నవంబరు 20వ తేదీ నాటికే గతేడాది కంటే ఎక్కువ మిస్సింగ్‌ కేసులు పోలీసులు నమోదు చేశారు. అత్యధిక కేసులను ఇప్పటికే ఛేదించారు.

జిల్లాలో పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులు

చాకచక్యంగా ఛేదిస్తున్న పోలీసులు

అక్కరకొస్తున్న సాంకేతికత

రాత్రివేళ ముమ్మర గస్తీలతోనూ ఫలితం

వదిలే ప్రసక్తే లేదు

కిడ్నాప్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులు తప్పించుకోలేరు. తల్లిదండ్రులు చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వయసుకు వచ్చిన పిల్లలపై నిఘా పెట్టాలి. బుద్ధిమాంద్యం ఉన్న వారిని బయటికి వదలరాదు. వృద్ధులకు పోషణ భారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. కిడ్నాప్‌ కేసులను తప్పక ఛేదిస్తాం.

– ఎస్‌వీ మాధవ్‌రెడ్డి, ఎస్పీ

Advertisement
Advertisement