Sakshi News home page

No Headline

Published Tue, Mar 26 2024 8:00 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /నెట్‌వర్క్‌ ....

రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలు.. నెర్రలు బారుతున్న వరి పొలాలు.. పశువులకు మేతగా మారుతున్న పంటలు.. ఇలా మెతుకు సీమపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. మంచి దిగుబడితో చేతికందాల్సిన పంటలు కళ్లెదుటే ఎండుముఖం పడుతుండటంతో అన్నదాతల కంట కన్నీరు వస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో యాసంగి పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు తమ పంటలను కాపాడుకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. రోజురోజుకు ఆందోళన స్థాయికి పడిపోతున్న భూగర్భ జలాలతో బోర్ల నుంచి నీటి ధారా తగ్గుముఖం పట్టింది. పలుచోట్ల బోర్లు పూర్తిగా వట్టిపోయాయి. బోర్ల ఆధారంగా సాగు చేసిన వరి పంటలు నెర్రలు బారాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

మూడు మీటర్లకు పడిపోయిన నీటి మట్టం..

ఉమ్మడి జిల్లాలో భూగర్భజల మట్టం పడిపోతోంది. ఎండల తీవ్రతకు ఈ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో ఏకంగా మూడు మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే భారీ స్థాయిలో నీటి మట్టాలు పడిపోయాయి. ఈ మండలంలో 2023 ఫిబ్రవరిలో 10.65 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలమట్టం.. 2024 ఫ్రిబవరి వచ్చే సరికి 13.66 మీటర్ల లోతుకు వెళ్లింది. సగటున 0.2 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. ఈ మార్చి నెలలో ఈ నీటి మట్టాలు ఇంకా లోతుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. మెదక్‌ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే సగటున 0.83 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది.

ఇదీ పంటల తీరు..

● సంగారెడ్డి జిల్లా ఈ యాసంగిలో మొత్తం 1.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి పంట 1.02 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇందులో బోర్లు వట్టి పోవడం.. ఎండల తీవ్రతతో ఇప్పటికే సుమారు పది వేల ఎకరాల్లో వరి ఎండిపోయినట్లు అనధికారిక అంచనా.

● మెదక్‌ జిల్లాలో ఈసారి 2.61 లక్షల ఎకరాలలో వరిపంటలను సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 95 వేల బోరుబావుల ఆధారంగా పంటలను నీటి తడులు అందిస్తున్నారు.

● సిద్దిపేట జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 2.52 లక్షల ఎకరాలు. గత ఏడాది (2023 యాసంగిలో)3.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ యాసంగి సీజనులో 3.72 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు.

పంటలు కాపాడుకునేందుకు పాట్లు

కళ్లెదుటే ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బోర్ల నుంచి సన్నటి ధార వస్తుండటంతో రోజంతా బోరు నడిచినా మడులు తడవడం లేదు. దీంతో పైపులు వేసుకుని కింద మడులకు నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని చోట్ల చేసేదేమీ లేక ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసుకుంటున్నారు. ఇందుకోసం రూ.వేలల్లో ఖర్చు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో ఎండిపోతున్న పంటలో పశువులను మేపుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement