డైలమాలో ట్రైడెంట్‌ ! | Sakshi
Sakshi News home page

డైలమాలో ట్రైడెంట్‌ !

Published Sat, Nov 18 2023 6:34 AM

ట్రైడెంట్‌ కర్మాగారం - Sakshi

జహీరాబాద్‌: మండలంలోని కొత్తూర్‌(బి)లో గల ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు గాను క్రషింగ్‌ను ప్రారంభించడం అనుమానంగానే ఉంది. ఈనెల మొదటి వారంలోనే ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికే సగం రోజులు గడిచిపోయాయి. ఈ విషయంలో యాజమాన్యం నుంచి స్పందన లేదు. ప్రభుత్వం సైతం రైతాంగానికి ఎలాంటి స్పష్టతనివ్వక పోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఇటు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం, అధికార యంత్రాంగం కానీ చొరవ చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు మార్లు యాజమాన్యం, అధికార యంత్రాంగం స్పష్టమైన హామి ఇచ్చినా ఆచరణలో మాత్రం విఫలం అయ్యారనే విమర్శలున్నాయి. గత క్రషింగ్‌ సీజన్‌ బకాయిలు సైతం పెండింగ్‌లోనే పెట్టింది.

4.50 లక్షల టన్నుల పంట

జహీరాబాద్‌ కర్మాగారం జోన్‌ పరిధిలో 4.50లక్షల టన్నుల మేర చెరకు ఉత్పత్తి అవుతుందనే అంచనా. సుమారు 17వేల ఎకరాల్లో పంట సాగులో ఉంది. గత ఏడాది సైతం ఇంతే స్థాయిలో సాగయ్యింది. కర్మాగారంపై రైతులకు నమ్మకం లేక పోవడంతో సగం చెరకు ఉత్పత్తులను పక్క రాష్ట్రాల్లోని కర్మాగారాలకు తరలించుకున్నారు. ఈ ఏడాది కూడా ట్రైడెంట్‌ యాజమాన్యంపై నమ్మకం కుదరడం లేదు. దీంతో మొత్తం పంటను పక్కా రాష్ట్రాలకే తరలించుకోవాలనే ఉద్దేశంతో రైతులున్నారు. గత బిల్లులు కూడా సక్రమంగా చెల్లించక పోవడం కూడా ఒక కారణంగా రైతులు చెబుతున్నారు. ఆ సీజన్‌కు సంబంధించి యాజమాన్యం రైతులకు సుమారు రూ.9కోట్ల మేర బకాయి పడింది.

2.55లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌

ట్రైడెంట్‌ కర్మాగారంలో 2022–23 క్రషింగ్‌ సీజన్‌కు గాను 2.55 లక్షల టన్నుల చెరకును గానుగాడించింది. టన్నుకు రూ.3,270 ధర నిర్ణయించింది. మొదటి విడత కింద టన్నుకు రూ.3వేల వంతున చెల్లిస్తూ వచ్చింది. మిగతా రూ.270 పెండింగ్‌ పెట్టింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో చెరకును సరఫరా చేసిన రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో బిల్లులు బకాయి పడింది. జోన్‌ పరిధిలో ఉన్న మొత్తం 2287 మంది రైతులు కర్మాగారానికి చెరకును సరఫరా చేశారు. ఇందులో 1699 మంది రైతులకు టన్నుకు రూ.270 వంతున బకాయి పడింది. మిగిలిన రైతులకు పూర్తి స్థాయిలో బిల్లులు బకాయి పడింది. రూ.83 కోట్లకు గాను ఇంకా రూ.9 కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు.

కర్ణాటకకు తరలించుకుంటున్నా

క్రషింగ్‌ ప్రారంభించేందుకు యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. కర్ణాటకకు పంటను తరలించుకుంటున్నా. ఇప్పటికే 200 టన్నుల చెరకును తరలించా. 45 ఎకరాల్లో చెరకు సాగు చేసుకున్నా. 2 వేల టన్నుల చెరకు ఉత్పత్తి కానుంది. గత ఏడాదికి సంబంధించి యాజమాన్యం వద్ద నుంచి రూ.5 లక్షల మేర బిల్లులు కూడా రావాల్సి ఉంది.

బి.మల్లికార్జున్‌రెడ్డి,రైతు ధనాసిరి, మొగుడంపల్లి మండలం

1/1

Advertisement
Advertisement