ఏడాదిలోగా ‘పాలమూరు’ పూర్తి చేస్తాం | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా ‘పాలమూరు’ పూర్తి చేస్తాం

Published Tue, Nov 14 2023 4:26 AM

రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌  - Sakshi

పరిగి/కుల్కచర్ల: కాంగ్రెస్‌ నాయకులు అడ్డంకులు సృష్టించడం వల్లే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆలస్యమైందని, లేకుంటే ఇప్పటికే ప్రతి గ్రామానికీ సాగునీరు అందేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమ వారం కుల్కచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌ షో పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేని కాంగ్రెస్‌ నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ నాయకులు వేసిన కేసుల కారణంగానే ఆలస్యం జరిగిందని మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఏడాదిలోగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు మన ప్రాంతంలో వరి దిగుబడి ఎలా ఉండేదో, నేడు ఎలా ఉందో ప్రజలు గుర్తించాలన్నారు. దేశంలోనే వరి పండించడంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందిస్తామన్నారు. ఏ ఊరికి పోయినా హనుమంతుని గుడి ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఏ ఇంటికి పోయినా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ఉంటాయన్నారు. పరిగి నియోజకవర్గంలో ఎక్కువ తండాలు ఉన్నాయని, వాటిని గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులకు 6శాతం ఉన్న రిజర్వేషన్‌ను 10శాతానికి పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి తండాలో సేవాలాల్‌ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

సీఎం కేసీఆర్‌ పాలనలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. రూ.రెండు వందలు ఉన్న పింఛన్‌ను రూ. 2 వేలకు చేశారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఇంటికీ అందేలా కృషి చేశారన్నారు. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరిగిలో డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాల, కుల్కచర్లలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. గండీడ్‌, మహ్మదాబాద్‌ మండలాలను వికారాబాద్‌ జిల్లాలో కలపాలని కోరారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పరిగి నియోజకవర్గానికి త్వరితగతిన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేటీఆర్‌ గండీడ్‌, మమ్మదాబాద్‌ మండలాలను వికారాబాద్‌ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. పరిగి, కుల్కచర్ల మండల కేంద్రాల్లో కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

హరీశ్వర్‌రెడ్డి సేవలు మరువలేనివి

తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ స్వర్గీయ హరీశ్వర్‌రెడ్డి చురుగ్గా పాల్గొన్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తన పదవిని వదిలి కేసీఆర్‌ వెంట నడిచిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మనలో లేక పోవడం చాలా బాధాకరమని, నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమన్నారు.

కేటీఆర్‌కు ఘన స్వాగతం

కుల్కచర్ల/దోమ: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం కుల్కచర్ల గిరిజన గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో హెలిక్యాప్టర్‌లో ల్యాండ్‌ అయ్యారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్‌ రెడ్డి, నాగేందర్‌గౌడ్‌, ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశ్‌ కేటీఆర్‌కు బొకే అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కుల్కచర్ల మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు కేటీఆర్‌ బయలుదేరి వెళ్లారు.

కాంగ్రెస్‌ నాయకుల అడ్డంకులతోనే ఆలస్యం

పరిగిలో రెండో సారి విజయం ఖాయం

తెలంగాణ ఉద్యమంలోహరీశ్వర్‌రెడ్డి కృషి ఎనలేనిది

కుల్కచర్ల రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌

Advertisement
Advertisement