Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

Published Tue, Apr 16 2024 1:30 AM

దిగువమెట్ట చెక్‌పోస్టును పరిశీలిస్తున్న ఎస్పీ    - Sakshi

తర్లుపాడు: బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాగేళ్లముడుపు వద్ద జరిగింది. మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి గ్రామానికి చెందిన కంది వెంకటేశ్వరరెడ్డి (47) ఆదివారం ఫతేపురం గ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యాడు. తిరిగి స్వగ్రామం బయలుదేరాడు. మార్గం మధ్యలో గొల్లపల్లి ఓవర్‌హెడ్‌ ట్యాంకు సమీపంలోని మూలమలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి కొంత దూరంలో పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం గ్రామస్తులు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న తర్లుపాడు ఎస్సై సుధాకర్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

గిద్దలూరు రూరల్‌: ఎన్నికల సమయంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గరుడ సుమీత్‌ సునీల్‌ అన్నారు. మండలంలోని దిగువమెట్ట ఫారెస్ట్‌ చెక్‌పోస్టును సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టుల నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలన్నారు. ఎన్నికల సమయంలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. అందరి వాహనాలు తప్పనిసరిగా తనిఖీ చేసి పంపాల్సి ఉంటుందన్నారు. చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో బాధ్యతగా పూర్తిస్థాయిలో సేవలను అందించాలన్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు పోలీసుస్టేషన్‌ను సందర్శించి కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ బాలసుందరావు, సీఐలు వైవీ సోమయ్య, దాసరి ప్రసాద్‌, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

రైల్వేస్టేషన్‌లో రూ.6.17 లక్షలు స్వాధీనం

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు రైల్వేస్టేషన్‌లో వ్యక్తి వద్ద నుంచి జీఆర్పీ పోలీసులు రూ.6,17,700 స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ సీఐ ఎన్‌.శ్రీకాంత్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జీఆర్‌పీ డీఎస్పీ సీ.విజయభాస్కర్‌ నేతృత్యంలో రైల్యేస్టేషన్‌లో సోమవారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో రైలు ఎక్కుతున్న బాపట్లకు చెందిన కలువ రామకృష్ణపై అనుమానంతో బ్యాగ్‌ తనిఖీ చేయగా రూ.6,17,700 నగదు లభ్యమైందన్నారు. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో నగదు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు మారుబోయిన మురళి, ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement