Sakshi News home page

విద్యార్థి మృతికి కారకులపై కఠిన చర్యలు

Published Wed, Dec 20 2023 1:54 AM

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌   - Sakshi

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌

మార్కాపురం రూరల్‌: జిల్లా పరిషత్‌ హైస్కూల్లో విద్యార్థి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. మార్కాపురం మండలం రాయవరం జిల్లా పరిషత్‌ పాఠశాలలో గత అక్టోబర్‌ 4వ తేదీన 9వ తరగతి విద్యార్థి కోట్ల రవికిరణ్‌ విష పురుగు కుట్టి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తమకు సరైన న్యాయం జరగలేదని బాధిత కుటుంబం ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాయవరం జిల్లా పరిషత్‌ పాఠశాలకు వచ్చిన ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌.. విద్యార్థులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులను నాటి సంఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాయుడుపల్లి గ్రామానికి చెందిన కోట్ల రవికిరణ్‌ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాలేకానీ వారితో చాకిరీ చేయించడం సమంజసం కాదన్నారు. విద్యార్థులు తమతో నిజాలు చెప్పకుండా ఉపాధ్యాయులు గట్టిగా ప్రయత్నించినట్లుందని వ్యంగ్యంగా అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఉద్దేశపూర్వకంగా పనులు చేయించకపోయినా ఆ రోజున రవికిరణ్‌ను పురుగు కుట్టడం బాధాకరమన్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే బతికేవాడన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వ విద్యా విధానాన్ని కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.

విద్యార్థి మృతిపై మార్కాపురం సబ్‌కలెక్టర్‌ సేథుమాధవన్‌ను విచారణ అధికారిగా నియమించి పదిరోజుల్లో నివేదికను ఎస్సీ కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆయన వెంట డీఈఓ సుబ్బారావు, మార్కాపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, డీవైఈఓ చంద్రమౌలీశ్వరావు, సీఐ ఎ.వెంకటేశ్వర్లు, ఎస్సైలు కోటేశ్వరరావు, వెంకటేశ్వరనాయక్‌, ఎంపీడీఓ చందన, తహసీల్దార్‌ మంజునాథరెడ్డి, ఎంఈఓలు రాందాస్‌నాయక్‌, శ్రీనివాసులు, ఏపీఎం జీవరత్నం, పలు దళిత సంఘాల నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement