17,505 గిరిజన గృహాలకు.. ఉచిత విద్యుత్‌ మీటర్లు | Sakshi
Sakshi News home page

17,505 గిరిజన గృహాలకు.. ఉచిత విద్యుత్‌ మీటర్లు

Published Sat, Dec 23 2023 4:36 AM

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న 
ఏపీఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌  
 - Sakshi

సీతంపేట: ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో ఉన్న ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 3,761 గిరిజన గ్రామాల్లో 17,505 గృహాలకు ఉచితంగా విద్యుత్‌ మీటర్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆ శాఖ డైరెక్టర్‌ (ప్రాజెక్టులు) ఏవీవీ సూర్యప్రతాప్‌ తెలిపారు. విద్యుత్‌ కనెక్షన్లపై సీతంపేట ఏజెన్సీలో జరుగుతున్న సర్వేను శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీలో పీవీటీజీ గిరిజనులకు ఎన్ని కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్లు లేవనేదానిపై సర్వేచేస్తున్నామన్నారు. ఈ నెల 24 నాటికి సర్వే పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఉచిత విద్యుత్‌ మీటర్లు ఇచ్చి ప్రతీ ఇంటికి విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని స్పష్టంచేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 2,095 హేబిటేషన్లలో 13,600ల గృహాలకు విద్యుత్‌ సదుపాయం లేదని అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి నివేదికలు అందాయన్నారు. విజయనగరం జిల్లాలో 553 హేబిటేషన్లకు 1367, ఏలూరులో 95 గ్రామాల్లో 409, తూర్పుగోదావరి జిల్లాలో 625 గ్రామాలకు 4013 కుటుంబాలకు విద్యుత్‌ మీటర్లు లేవన్నారు. అలాగే, శ్రీకాకుళంలో 451 హేబిటేషన్లకు 1468 ఇళ్లకు విద్యుత్‌ సదుపాయం లేదన్నారు. వీటన్నింటికీ యుద్ధప్రాతిపదికన ఉచిత కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇకపై 24 గంటలూ విద్యుత్‌ సరఫరాకు వీలుగా త్రీఫేజ్‌ సప్‌లై త్వరలో ఇస్తామన్నారు. పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్‌ సరఫరా ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ దశలవారీగా 18 నెలల్లో పూర్తిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఎన్‌.కృష్ణమూర్తి, ఏఈ నీలిమ, తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 24 నాటికి సర్వే పూర్తి

గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం

ఏపీఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్టులు) సూర్యప్రతాప్‌

Advertisement
Advertisement