చేపల కనీస అమ్మకం ధరలపై తీర్మానం | Sakshi
Sakshi News home page

చేపల కనీస అమ్మకం ధరలపై తీర్మానం

Published Thu, Dec 21 2023 2:10 AM

మాట్లాడుతున్న ఉమాశంకర్‌ రెడ్డి  - Sakshi

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండేందుకు సమష్టిగా కనీస అమ్మకం ధరను నిర్ణయించుకుని చేపలు విక్రయించాలని ఆక్వా రైతు సంఘం నాయకుడు కె.ఉమాశంకర్‌ రెడ్డి తెలిపారు. బాపులపాడు మండలం కానుమోలులోని యూఎస్‌ఆర్‌ ఆక్వా ఫీడ్స్‌ ఫ్యాక్టరీ ప్రాంగణంలో బుధవారం ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఆక్వా రైతుల సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ఫంగస్‌ చేపలు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా ఉండేందుకు కనీస అమ్మకం ధరలను సమావేశంలో నిర్ణయించారు. చేపల ఫీడ్‌ ధరలు, చెరువు లీజు రేట్లు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో చేపల అమ్మకం ధరలను పెంచక తప్పటం లేదని తెలిపారు. 1200 గ్రాముల బరువు కలిగిన ఫంగస్‌ చేపల కిలో ధర రూ.83 గానూ, 1500 గ్రాముల బరువు కలిగిన ఫంగస్‌ చేపల కిలో ధర రూ.85గా విక్రయించాలని ఆక్వా రైతులు ఏకగ్రీవంగా సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ఆక్వా ట్రేడర్లు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేజీ ఫంగస్‌ చేపల ధర రూ.65–71 మధ్య ఉండటంతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, కేజీ చేప పెంపకానికి కనీస ఖర్చు రూ.85 అవుతుందని చెప్పారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో ఆక్వా రైతుల సమావేశం ఏర్పాటు చేయదల్చినట్లు తెలిపారు. ఆక్వా రైతు నాయకులు పెద్దిరెడ్డి రాము, కేశవరావు, ఎలకపల్లి రవి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement