వడగళ్ల వాన బీభత్సం | Sakshi
Sakshi News home page

వడగళ్ల వాన బీభత్సం

Published Sat, Apr 20 2024 1:15 AM

వల్లభాపూర్‌లో ధాన్యం కుప్పలో నిలిచిన నీటిని తొలగిస్తున్న రైతులు  - Sakshi

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయా యి. కోతకొచ్చిన మామిడి కాయలు రాలిపోయా యి. ఉరుములు మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు నందిపేట మండలం ఖుద్వాన్‌పూర్‌లో మూడు గేదెలు చనిపోయాయి. పలు మండలాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. వడగళ్లు, గాలుల ప్రభావంతో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో కోతదశకు వచ్చిన వరి గింజలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 25 శాతం పంట కోయాల్సి ఉంది. అకాల వర్షానికి వెయ్యి ఎకరాలకు పైగా వరికి నష్టం జరిగే అవకాశముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఎదిగిన నువ్వు పంట దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది. వరి కుప్పలపై కప్పిన టార్పాలిన్లు గాలులకు కొట్టుకుపోయాయి. వడగళ్ల వర్షానికి ఇందల్వాయి, ధర్పల్లి, నందిపేట్‌, మాక్లూర్‌, డొంకేశ్వర్‌, మోపాల్‌, ఆలూ ర్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌, రెంజల్‌ మండలాల్లోని కల్లాలు నీటమునిగాయి. పలుచోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వారం రోజులుగా అకాల వర్షాలు పంటలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు తడిసిన వడ్లకు మొలకలు వచ్చే అవకాశముంది. కల్లాల్లో నేడో, రేపో అమ్ముడుపోయే ధాన్యం పూర్తిగా తడిసిముద్ద కావడంతో రంగుమారిన పంటను ఎలా అమ్ముడుపోతుందోనని రైతులు దిగులు చెందుతున్నారు. వర్షానికి నేల మెత్తగా మారడంతో వరికోతలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.

30 రోజుల్లో మూడుసార్లు...

గత 30 రోజుల్లో మూడుసార్లు వడగళ్ల వర్షం పంటలను దెబ్బతీసింది. మార్చి 16న కురిసిన వానకు జిల్లాలో 6,058 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నెల 8న కురిసిన వర్షానికి 1,726 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ప్రస్తుతం కురిసిన వడగళ్ల వా నకు వరి, మామిడి, నువ్వు పంటలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యవసాయాధికారులు శని వారం పంటనష్టం వివరాలను సేకరించనున్నారు.

వందల ఎకరాల్లో దెబ్బతిన్న వరి

నీటమునిగిన కల్లాలు, తడిసిన ధాన్యం,

రాలిన మామిడి కాయలు

ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

Advertisement
Advertisement