Explained: Can I Get CoronaVirus 2nd Time? Yes, You Can Get COVID-19 Again, Corona News in Telugu - Sakshi
Sakshi News home page

రెండోసారి కరోనా : వాస్తవాలివే!..

Published Sun, Aug 30 2020 10:33 AM

Second Time Corona Infection Here Is The Truth - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా‌ విలయతాండవం చేస్తోంది. భారత్‌లోనూ రక్త పిపాస వైరస్‌ మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 35 లక్షలు దాటగా నిత్యం కొన్ని వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. అయితే కరోనా వైరస్‌ సోకి నెగిటివ్‌ వచ్చిన వ్యక్తులకు కొన్ని వారాలు, నెలల తర్వాత మళ్లీ పాజిటివ్‌ వచ్చిన కేసులు ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనానుంచి కోలుకున్న వ్యక్తులు మళ్లీ కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ఆందోళనకు గురవుతున్నారు. రెండవ సారి కరోనా సోకితే తాము ఏమవుతామోననుకుంటూ తెగ బాధపడిపోతున్నారు. అయితే రెండవ సారి కరోనా సోకే విషయంపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. కరోనా బారినుంచి కోలుకున్న వ్యక్తులకు మరో సారి పాజిటివ్‌ రావటానికి కారణం వారి శరీరంలోని మృత వైరస్‌లేనని స్పష్టం చేశారు.

రెండవసారి పాజిటివ్‌ వచ్చినప్పటికి వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవని, వారినుంచి వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. ‘‘క్లినికల్‌ ఇన్‌ఫెక్షస్‌ డీసీజెస్‌’’ జర్నల్‌లో ప్రచురించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్‌ యాంటీ బాడీస్‌ను విడుదల చేస్తుందని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత యాంటీ బాడీస్‌ సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు. శరీరంనుంచి వైరస్‌లను బయటకు పంపేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ‘రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్’ టెస్టుల్లో కోలుకున్న వ్యక్తులకు కూడా కొన్ని వారాల తర్వాత పాజిటివ్‌ వస్తుందని పేర్కొన్నారు. ( 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌? )

దీనిపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘‘  రెండవ సారి కరోనా వైరస్‌ సోకిన కేసుల్ని ఇప్పుడిప్పుడే చూస్తున్నాము. అయితే రెండవ సారి పాజిటివ్‌ వచ్చినపుడు మొదటిసారి లాగే రెండవ సారి కూడా లక్షణాలు కలిగి ఉన్నట్లు మేము గుర్తించలేదు. మొదటి సారి మాత్రమే లక్షణాలు కనిపించాయి.. రెండవ సారి వైరస్‌ సోకినపుడు లక్షణాలు లేవు. రెండవ సారి కూడా లక్షణాలతో కరోనా సోకిన కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేద’ని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement