థైరాయిడ్‌తో ఆరోగ్యం అయోమయం | Sakshi
Sakshi News home page

థైరాయిడ్‌తో ఆరోగ్యం అయోమయం

Published Sat, May 25 2024 1:50 PM

థైరాయ

● థైరాయిడ్‌ వస్తే ఎన్నో ఇబ్బందులు ● జీవితం నిస్సారమైన భావన ● మందులు, వ్యాయామంతో నియంత్రణ ● జిల్లాలో 10 శాతం మందికి వ్యాధి ● నేడు వరల్డ్‌ థైరాయిడ్‌ డే

ఆరు నెలలకోసారి

పరీక్ష చేయించుకోవాలి

థైరాయిడ్‌ జబ్బున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటే ఏమీ కాదు. హైపోథైరాయిడిజం ఉన్న వారు నార్మల్‌గా ఉన్నా ప్రతి ఆరు నెలలకోసారి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. హైపర్‌ థైరాయిడిజం ఉన్న వారు మూడు నెలలకోసారి చేయించుకోవాలి. వీరు క్యాబేజి, కాలిఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో థైరాయిడ్‌ పరీక్ష ఉచితంగా చేస్తున్నాం. ఈ వ్యాధికి అయ్యే మందుల ఖరీదు కూడా చాలా తక్కువ.

– డాక్టర్‌ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ

విభాగాధిపతి, జీజీహెచ్‌, కర్నూలు

గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి

గర్భిణులు తప్పనిసరిగా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్‌ నిర్ధారణ అయితే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. ఆరు వారాల తర్వాత తిరిగి పరీక్ష చేయించి సమీక్షించుకోవాలి. అనంతరం ప్రతి మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ప్రసవం తర్వాత కూడా పరీక్ష చేయించుకుని మందులు వాడాలి. గర్భిణులకు ఇది వరకే థైరాయిడ్‌ ఉండి మందులు వాడకపోతే పుట్టబోయే బిడ్డకు ఈ జబ్బు వస్తుంది. ప్రసవం అయిన వెంటనే బిడ్డకు కూడా థైరాయిడ్‌ పరీక్ష చేయించడం మంచిది. పిల్లలకు థైరాయిడ్‌ ఉన్నా మందులు వాడకపోతే బుద్ధిమాంద్యం వస్తుంది.

– డాక్టర్‌ కె. కావ్య, గైనకాలజిస్టు, కర్నూలు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజీ విభాగంలో హార్మోన్‌ల అసమతుల్యతల వల్ల వచ్చే వ్యాధులకు చికిత్స చేస్తారు. ఇందులో థైరాయిడ్‌ వ్యాధి ఒకటి. ఈ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ చికిత్స చేస్తారు. ఈ విభాగానికి థైరాయిడ్‌ సమస్యతో ప్రతి నెలా 600 నుంచి 700 మంది చికిత్స కోసం వస్తారు. ఇందులో 400 నుంచి 500 మంది హైపోథైరాయిడిజం, 200 మంది హైపర్‌ థైరాయిడిజంతో బాధపడుతున్న వారున్నారు. ప్రైవేటు వైద్యుల వద్దకు సైతం ప్రతిరోజూ 80 నుంచి 120 మందికి పైగా థైరాయిడ్‌ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. వారి వద్ద సగటున నెలకు 2వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. మొత్తం థైరాయిడ్‌ రోగుల్లో 70 శాతం మందికి హైపో థైరాయిడ్‌, 30 శాతం మందికి హైపర్‌థైరాయిడ్‌ బాధితులు ఉంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య ఇప్పుడు బాధిస్తోంది. సీ్త్రలలో 20 శాతం, పురుషులలో 15 మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. వీరిలో కొందరికి గాయిటర్‌(గొంతు వద్ద గడ్డ) ఉంటోంది. ఇలా కణితి ఉన్న వారికి ఆపరేషన్‌ అవసరం లేదు. క్యాన్సర్‌గా మారితేనే ఆపరేషన్‌ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్‌ కణితిలు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్‌ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది.

థైరాయిడ్‌ వ్యాధుల లక్షణాలు

హైపో థైరాయిడ్‌

నీరసం, మలబద్దకం, చర్మం, వెంట్రుకలు పొడిబారడం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేకపోవడం, గుండె తక్కువసార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్‌ గ్రంథి వాపు తదితర లక్షణాలు ఉంటాయి.

హైపర్‌ థైరాయిడ్‌

ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్రలేమి, నీరసం, ఎక్కువసార్లు విరేచనాలు అవ్వడం, నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేకపోవడం, గొంతు ముందు వాపు, గుండె దడగా అనిపించడం, కళ్లు పెద్దవిగా అవ్వడం,చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

గాయిటర్‌

గాయిటర్‌ సాధారణంగా 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నా, థైరాయిడ్‌ సమస్యతో బాధపడే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అధిక బరువు, ఇన్సూలిన్‌ రెసిస్టెన్స్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్న వారిలో గాయిటర్‌ వచ్చే అవకాశం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

థైరాయిడ్‌ను పూర్తిగా నయం చేయలేం. కానీ మందులు, జీవనశైలి మార్పుల సాయంతో నియంత్రించవచ్చు. థైరాయిడ్‌ బాధితులు ఒత్తిడికి దూరంగా ఉండాలి. మానసిక, శారీరక ఒత్తిడి శరీరంలో ఇబ్బందులు పెంచుతుంది. ఒత్తిడిని తొలగించుకోవడానికి ధ్యానం అలవాటు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో తగినంత కాల్షియం, ప్రొటీన్‌, అయోడిన్‌, మెగ్నీషియం ఉంటే థైరాయిడ్‌ పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే విటమిన్‌ ఎ, బి, సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు, జీవక్రియ మెరుగుపడేందుకు రోజూ వ్యాయామం చేయాలి. క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్‌, స్ట్రాబెర్రీలను తినడం తగ్గించాలి. పాలు, ఛీజ్‌, మాంసం, చేపలు, ఖర్జూరం, గుడ్డు, తెల్లసొన తినాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక రోజూ పరగడుపునే మాత్రలు తీసుకోవడం వల్ల సమస్య నియంత్రణలో ఉంటుంది. విటమిన్‌–డి లోపం వల్ల కూడా థైరాయిడ్‌ సమస్య వస్తుంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటే థైరాక్సిన్‌ ఎక్కువ ఉత్పత్తి చేసి హైపర్‌ థైరాయిడ్‌ కలిగేలా చేస్తుంది. ఈ సమస్య ఉన్న వారు రోజుకు 5 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. వాల్నట్స్‌ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అది థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపరుస్తుంది. దీంతో థైరాక్సిన్‌ అవసరమున్నంత మేర శరీరానికి అంది థైరాయిడ్‌ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఒకప్పుడు థైరాయిడ్‌ అంటే గొంతు వద్ద వాపు ఉన్న వారులే అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి పది మందిలో ఒకరికి ఈ సమస్య వస్తోంది. గొంతు వాపు రాకపోయినా హైపోథైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌గా పిలిచే ఈ సమస్య జనాన్ని తీవ్రంగా వేధిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ఈనెల 25న ‘వరల్డ్‌ థైరాయిడ్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. – కర్నూలు(హాస్పిటల్‌)

థైరాయిడ్‌ అంటే..

థైరాయిడ్‌ అనేది సీతాకొకచిలుక ఆకారంలో కంఠం వద్ద ఉండే ఒక ఎండోక్రైన్‌గ్లాండ్‌. ఇది థైరాక్సిన్‌ అనే థైరాయిడ్‌ హార్మోన్‌ను విడుదల చేయడం ద్వారా శరీరంలో అనేక జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. తగినంత థైరాయిడ్‌ హార్మోన్‌ విడుదల కాకపోవడం(హైపోథైరాయిడిజం), అవససరమైన దాని కన్నా ఎక్కువగా థైరాయిడ్‌ విడుదల కావడం(హైపర్‌ థైరాయిడిజం), థైరాయిడ్‌ స్వెల్లింగ్‌(గాయిటర్‌), థైరాయిడ్‌ ట్యూమర్స్‌, థైరాయిడ్‌ క్యాన్సర్స్‌ ఉంటాయి. హైపోథైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం అనేవి చాలా సాధారణంగా కనిపించే థైరాయిడ్‌ వ్యాధులు. హైపోథైరాయిడ్‌ సమస్య హైపర్‌ థైరాయిడ్‌ కన్నా ఐదు రెట్లు అధికంగా ఉంది. ఎక్కువగా ఈ రెండు సమస్యలే వస్తున్నాయి. గర్భిణుల్లో ఈ సమస్యను ముందుగానే గుర్తించకపోతే, పుట్టే పిల్లల్లో మేధోపరమైన లోపాలు రావచ్చు. చిన్నతనంలోనే ఈ సమస్య గుర్తించడం మంచిది. లేదంటే పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాదు మానసికంగానూ మందగించే ప్రమాదం ఉంది. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్‌ వస్తుంది.

థైరాయిడ్‌తో ఆరోగ్యం అయోమయం
1/2

థైరాయిడ్‌తో ఆరోగ్యం అయోమయం

థైరాయిడ్‌తో ఆరోగ్యం అయోమయం
2/2

థైరాయిడ్‌తో ఆరోగ్యం అయోమయం

Advertisement
 
Advertisement
 
Advertisement