రేషన్‌ కార్డులు .. 5,49,169 రేషన్‌ షాపులు.. 1,204 ఎండీయూ వాహనాలు.. 351 ప్రతి నెలా బియ్యం పంపిణీ.. 7,228 టన్నులు | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డులు .. 5,49,169 రేషన్‌ షాపులు.. 1,204 ఎండీయూ వాహనాలు.. 351 ప్రతి నెలా బియ్యం పంపిణీ.. 7,228 టన్నులు

Published Mon, Nov 20 2023 2:04 AM

గోడౌన్‌ నుంచి బియ్యాన్ని లారీలో రేషన్‌ షాపులకు తరలిస్తున్న దృశ్యం - Sakshi

ప్రయోజనాలు వివరిస్తున్నాం

ఫోర్టిఫైడ్‌ బియ్యంలో ఉండే సూక్ష్మపోషకాలు, ఆ బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం గురించి అంగన్‌వాడీ కార్యకర్తలు తమ పరిధిలోని మహిళలకు వివరంగా తెలియజేస్తున్నారు. ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, విటమిన్‌ బీ–12 కలిగిన ఈ బియ్యంతో చేసిన పదార్థాలు బలవర్ధకమైన ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను నివారిస్తుంది.

– నిర్మల, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ, నంద్యాల

సూక్ష్మ పోషకాలు పుష్కలం

ఫోర్టిఫైడ్‌ బియ్యంలో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఫోర్టిఫైడ్‌ బియ్యం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. ఫోర్టిఫైడ్‌ బియ్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని బియ్యం పంపిణీ చేసే సమయంలో కార్డుదారులకు తెలియజేయాలని వలంటీర్లకు, ఎండీయూ వాహన నిర్వాహకులకు చెబుతున్నాం. – రాజునాయక్‌,

సవిల్‌ సప్లయ్‌ జిల్లా అధికారి, నంద్యాల

నంద్యాల(అర్బన్‌): ప్రజా ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఓ వైపు వైద్య సేవలను బలోపేతం చేస్తూ మరో వైపు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. పౌష్టికాహార లోపంతో అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలకు పుష్కలంగా సూక్ష్మ పోషకాలు ఉండే ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందిస్తోంది. బియ్యానికి అదనంగా విటమిన్లు, పోషకాలను జోడించడాన్ని రైస్‌ ఫోర్టిఫికేషన్‌ అంటారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కార్డు దారులకు పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తోంది. ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌ విటమిన్‌–బీ12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను అదనంగా బియ్యంలో చేర్చి పౌష్టికాహార లోపాన్ని అరికట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. నంద్యాల జిల్లాలో 5,49,169 బియ్యం కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు ప్రతి నెలా 7,228 టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జిల్లాలో 1,204 రేషన్‌ షాపులు ఉండగా వాటి నుంచి 351 ఎండీయూ వాహనాల ద్వారా కార్డు దారులకు ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా అవుతున్నాయి. ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి సూక్ష్మపోషకాలు అందుతాయి. ప్రధానంగా పౌష్టికాహార లోపం ఉన్న మహిళలు, చిన్నారులకు పోర్టిఫైడ్‌ బియ్యం ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, విటమిన్‌ బీ12తో చేసిన పిండితో ఫోర్టిఫైడ్‌ బియ్యం కెన్నెల్స్‌ తయారు చేస్తారు. వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న బియ్యంలో కలుపుతారు. ఐసీడీఎస్‌, ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ పథకాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందిస్తోంది. జిల్లాలో 1,363 అంగన్‌వాడీ కేంద్రంలోని 14,470 మంది గర్భిణులు, 12,535 మంది బాలింతలు, 1.20 లక్షల మంది చిన్నారులకు ఫోర్టిఫైడ్‌ బియ్యంతో వండిన ఆహారాన్ని అందిస్తున్నారు. అలాగే జిల్లాలోని 1,409 పాఠశాలల్లో సుమారుగా 1,54,561 విద్యార్థులకు రోజు పాఠశాలల్లో అందించే గోరముద్ద పథకానికి ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని వినియోగిస్తున్నారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు..

ఫోర్టిఫైడ్‌ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా ఇందులోని ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల్లో మెదడు, వెన్నెముక పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇక విటమిన్‌ బీ–12 మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి, ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని సరైన మోతాదులో ఉంచుతూ రక్తహీనతను అరికట్టడంలో ఐరన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. 400 మైక్రో గ్రామ్స్‌ అవసరం మనం రోజూ తీసుకునే ఆహారంలో 400 మైక్రోఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా మనం తీసుకునే వంద గ్రాముల అన్నంలో ఫోలిక్‌ యాసిడ్‌ 17 మైక్రోగ్రామ్స్‌ నుంచి 125 మైక్రోగ్రామ్స్‌ మధ్య ఉండాలి. అదే విధంగా ఐరన్‌ 28 నుంచి 42 మిల్లీ గ్రాములు ఉండాలి. ఇక ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్‌ బియ్యం 100 గ్రాముల్లో 98 మైక్రోగ్రామ్స్‌ ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ 40 మిల్లీ గ్రాములు ఉంటుంది. ఇక విటమిన్‌ బీ12 సమృద్ధిగా లభిస్తుంది.

Advertisement
Advertisement