Sakshi News home page

100 రోజులే..

Published Sat, Nov 11 2023 1:36 AM

- - Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వంద రోజుల సమయం మాత్రమే మిగిలింది. జాతర అభివృద్ధి పనుల కోసం ఆరు నెలల క్రితమే అధికారులు రూ.75 కోట్ల నిధులకు ఆయా శాఖల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా.. ఎన్నికల హడావుడిలో పడి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ సారి జాతర పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఈ సారి అసౌకర్యాలతో ఇక్కట్లు తప్పేలా లేవు.

పనులు పూర్తయ్యేనా..?

డిసెంబర్‌ 3వ తేదీ వరకు ఎన్నికలు హడావుడి ఉండటంతో ఈ సమయంలో నిధులు మంజూరయ్యే అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే నిధులు మంజూరు చేసిన అప్పటి వరకు రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ రెండు నెలల్లో అప్పటి అంచనా ప్రకారం రూ.75 కోట్లతో భక్తుల సౌకర్యార్థం పనులు చేపట్టినా.. పూర్తయ్యే దాఖలాలు లేవు. ఈ సారి జాతర ఎంతో ఆర్భాటంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మంత్రులు, అధికారుల మాటలు నిజమయ్యేలా కనిపించడం లేదు. కాగా ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జంపన్నవాగు వరదతో మేడారం ముంచెత్తింది. దీంతో శాశ్వతంగా చేపట్టిన అభివృద్ధి పనులు భారీగా ధ్వంసమయ్యాయి. ఇటు సాధారణ మరమ్మతులతో పాటు ధ్వంసమైన వాటికి మరమ్మతు చేపట్టడం అధికారులకు పెను సవాలే..

నాణ్యత లోపించడం ఖాయం

ఇంకా బడ్జెట్‌ విడుదల కాకపోవడం.. ఒక వేళ రెండు నెలల ముందు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా జాతర పనులు హడావుడిగా చేసే ఆస్కారం స్పష్టమవుతుంది. ప్రతి మహాజాతర ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. అప్పటి నుంచి పనులు ప్రారంభించినా.. జాతర ఒకటి, రెండు రోజుల ముందు వరకు పనులు కొనసాగేయి. ఈ సారి ఎన్నికలతో ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడంతో ఈ సారి జాతరలో భక్తులు అవస్థలు పడాల్సిందే.

నిధుల మంజూరులో ఆలస్యం

ఇంకా ప్రారంభం కాని ఏర్పాట్లు

ఎన్నికల హడావుడితో పనుల్లో జాప్యం

మేడారంపై అధికారుల చూపు కరువు

తాత్కాలిక పనులే..

జాతర రెండు నెలల ముందుగా నిధులు మంజూరు చేసినా శాశ్వత అభివృద్ధి పనులు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తాత్కాలిక పనులతోనే ఏర్పాట్లు చేపట్టి అధికారులు చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీ జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతున్నా.. ఆ మేరకు అధికారులు ముందు చూపుతో సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ సారి జాతరలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లు జాతర నాటికి కూడా పూర్తయ్యే అవకాశాలు లేవు. అధికారులు ఏ మేరకు సౌకర్యాలు కల్పిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement