Sakshi News home page

పస్తులుండి పిల్లల ఆకలి తీరుస్తున్నా: మహేశ్‌బాబు జిరాక్స్‌‌

Published Wed, Mar 31 2021 6:27 PM

Mahesh Babu Dupe Srinu Got Emotional Over His Financial Status - Sakshi

ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారని అంటుంటారు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ పలువురు సినీతారల జిరాక్స్‌లు సోషల్‌ మీడియాలో తరచూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలో హీరోగా కనిపించే కొందరు వ్యక్తులను సినిమాల్లో డూప్‌గా కూడా వాడుకుంటారు. అయితే వెండితెరపై హీరోగా తళుక్కుమనే ఈ డూప్‌ల నిజ జీవితాలు మాత్రం ఎంతో దారుణంగా ఉంటాయని చెప్తున్నాడు మహేశ్‌బాబు జిరాక్స్‌లా కనిపించే జూనియర్‌ ఆర్టిస్టు శ్రీను.

పస్తులుంటున్నాం..
దూరం నుంచి చూస్తే అచ్చం మహేశ్‌బాబులా కనిపించే శ్రీను ఆమధ్య పలు టీవీ కార్యక్రమాల్లో సందడి చేశాడు. ఇక తనకు ఏ ఢోకా లేదనుకున్న సమయంలో నెత్తిన లాక్‌డౌన్‌ పిడుగు పడింది. నటన తప్ప వేరే ఏదీ రాదని చెప్తున్న అతడు కడివెడు కష్టాల్లో ఉన్నాను, ఆదుకోండంటూ ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతకు ముందు ఒక్క ప్రోగ్రామ్‌ చేస్తే రెండు వేల రూపాయలు ఇచ్చేవారని, అలా నెలకు 5 ప్రోగ్రాంలు దొరికినా చేతికి పదివేలు వచ్చేవి, ఇల్లు గడిచేదని కానీ కరోనా నేపథ్యంలో చాలావరకు ప్రోగ్రామ్స్‌ ఉండటం లేదని వాపోయాడు. దీంతో తనకు ఆదాయమే రావట్లేదని, డబ్బు సంపాదించే మార్గం కూడా దొరకడం లేదని దిగులు చెందాడు. ఆర్థిక పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయని, దీంతో పెళ్లాం పిల్లలను పోషించలేక కొన్నిసార్లు వారిని కూడా పస్తులుంచుతున్నానంటూ కంటతడి పెట్టుకున్నాడు.

మా జీవితాల్లో మంచి రోజులు లేవు..
తనకు ముగ్గులు పిల్లలున్నారని, పెద్దోడికి 9 ఏళ్లు, మిగతా ఇద్దరిదీ(కవల పిల్లలు) పాలు తాగే వయసు అని తెలిపాడు. వారికి పాలు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నానన్నాడు. పైగా తనది అద్దె ఇల్లు అని, ఆదాయం తక్కువ, ఖర్చులేమో ఎక్కువని చెప్తున్నాడు. రాబడి లేకపోవడంతో తాను పస్తులుండి పిల్లల ఆకలి తీర్చుతున్నానని పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో తనలా చాలామంది ఉన్నారని, మమ్మల్ని ఆదుకునే వాళ్లు ఎవరూ లేరని బాధపడ్డాడు. ఏ రోజు పని దొరికితే ఆరోజే సంతోషపడాలి.. అంతేతప్ప తమ జీవితాల్లో మంచి రోజులు అనేవే లేవు అంటూ శ్రీను ఎమోషనల్‌ అయ్యాడు. ఇక తనను కరోనా కష్ట కాలంలో అంతో ఇంతో మహేశ్‌బాబు అభిమానులే ఆదుకుని అండగా నిలిచారని చెప్పుకొచ్చాడు. ఈ హీరోకు డూప్‌గా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. రాజకుమారుడు సినిమా నుంచి ఆయనకు డూప్‌గా చేస్తున్నానని, తనకు ఏదైనా పని ఇచ్చి ఆదుకోవాలంటూ నిర్మాతలను అభ్యర్థిస్తున్నాడు.

చదవండి: 'ఉప్పెన’ డిలీటెడ్‌ సీన్‌.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్‌

హీరో ధనుష్‌కు ఇష్టమైన విషాద 'లవ్‌స్టోరీ'

Advertisement

What’s your opinion

Advertisement