ఎదురెదురుగా బైక్‌, బొలెరో ఢీ | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా బైక్‌, బొలెరో ఢీ

Published Fri, May 24 2024 7:35 AM

ఎదురె

ఒకరి దుర్మరణం..

మరో ఇద్దరికి గాయాలు

కొల్లాపూర్‌ రూరల్‌/ పెంట్లవెల్లి: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనం, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పెంట్లవెల్లి ప్రధాన రహదారిలో సోమశిల క్రాస్‌రోడ్డు దగ్గర గురువారం తెల్లవారుజామున 3 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ హృషికేష్‌ కథనం ప్రకారం.. మంచాలకట్ట గ్రామానికి చెందిన మాసుం బొలెరోలో కొల్లాపూర్‌ నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. అలాగే కొండూరుకు చెందిన ఏదుల రామకృష్ణ(40) స్వగ్రామం నుంచి తన కుమారులతో కలిసి తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌ వెళ్లడానికి కొల్లాపూర్‌ వస్తున్నాడు. ఈ క్రమంలో సోమశిల క్రాస్‌రోడ్డు దగ్గర ఎదురెదురుగా వస్తున్న సమయంలో బొలెరో, బైక్‌ ఢీకొనడంతో రామకృష్ణ అక్కడిక్కడే మృతిచెందగా.. కుమారులు అభిషేక్‌, కార్తీక్‌లకు ఇద్దరికి కాళ్లు విరిగి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులకు కొల్లాపూర్‌ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రామకృష్ణ భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బావిలో దూకి

మహిళ బలవన్మరణం

లింగాల: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జగన్మోహన్‌, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అంబట్‌పల్లికి చెందిన పార్వతమ్మ (42)కు గోపాల్‌పేట మండలం రేవల్లికి చెందిన ఆనంద్‌తో 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో ఆనంద్‌ భాగ్యలక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా ఆనంద్‌ అయిదేళ్ల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి పార్వతమ్మ, భాగ్యలక్ష్మి తరచూ గొడవపడేవారు. ఇదే క్రమంలో పార్వతమ్మ గురువారం అంబట్‌పల్లికి వచ్చిన ఆమె తనకు ఇల్లు కట్టించాలని అన్నను కోరగా కొన్నిరోజుల తర్వాత కట్టిస్తానని తెలిపారు. పుట్టింట, మెట్టినింట న్యాయం జరగడం లేదని మనస్థాపానికి గురై క్షణికావేశంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

ఉరేసుకుని వ్యక్తి..

కొత్తకోట రూరల్‌: భార్యాభర్తల మధ్య గొడవ, ఆర్థిక ఇబ్బందులతో తాగుడుకు బానిసై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్‌పల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివకుమార్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆంజనేయలు (35)కు వనపర్తిలోని రాయిగడ్డకాలనీకి చెందిన సుజాతతో 2010లో వివాహాం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా ఆంజనేయులు వనపర్తిలోనే నివాసం ఉంటూ మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల తాగుడుకు బానిసకావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. బుధవారం జగత్‌పల్లికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆంజనేయులు గురువారం ఉదయం గ్రామశివారులో చెట్టుకు వేలాడుతూ మృతిచెంది గ్రామస్తులకు కనిపించాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

ఆటో బోల్తా..

పలువురికి గాయాలు

అచ్చంపేట రూరల్‌: మండలంలోని భోగ మహేశ్వరం వద్ద గురువారం ఆటో బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం తాడూరు, అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన కొందరు భక్తులు ఆటోలో ఉమామహేశ్వరంలోని శివుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఘాట్‌ రోడ్డులో భోగ మహేశ్వరం వద్ద ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు మహిళలు, వృద్ధులు, చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలయ కమిటీ చైర్మన్‌ కందూరి సుధాకర్‌ 108 వాహనంలో అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.

వ్యక్తిపై దాడి: కేసు నమోదు

శాంతినగర్‌: వ్యక్తిపై తీవ్రంగా దాడికి పాల్పడిన ఘటన శాంతినగర్‌లో చోటుచేసుకుంది. కర్నూల్‌ జిల్లా, గోనెగండ్ల మండలం, పెద్దమాదురి చెందిన మహ్మద్‌ ఇలియాస్‌ శాంతినగర్‌లోని చికెన్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. రాత్రి సమయంలో కోళ్లఫారంలోనే పడుకునేవాడు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి కటిక ఖాజావలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శాంతినగర్‌ పోలీసులు తెలిపారు.

ఎదురెదురుగా బైక్‌, బొలెరో ఢీ
1/1

ఎదురెదురుగా బైక్‌, బొలెరో ఢీ

Advertisement
 
Advertisement
 
Advertisement