Sakshi News home page

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Published Tue, Apr 16 2024 1:00 AM

-

వరంగల్‌ లీగల్‌/మడికొండ: పాతకక్షల నేపథ్యంలో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు, జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.సత్యనారాయణగౌడ్‌, మడికొండ పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట మండల రాంపేట గ్రామానికి చెందిన దాడబోయిన శంకరయ్యకు తన చిన్నాన్న కుటుంబంతో భూ సంబంధ వివాదం ఉంది. ఈ వివాదంలో గ్రామపెద్ద మనిషిగా వ్యవహరించే అలుపుల సమ్మయ్య ప్రత్యర్థులతో కలిసి తనకు అన్యాయం చేశాడని శంకరయ్య ద్వేషం పెంచుకున్నాడు. అలాగే, గ్రామంలో తన జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న వాటర్‌ ప్లాంట్‌కు కూడా ఆటంకం కల్పించాడని, గతంలో ఇరువురు పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోగా కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో సమ్మయ్య వల్ల తనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అడ్డుతొలగించుకుంటే తప్పా తనకు ప్రశాంతత లేదని భావించిన శంకరయ్య.. సమ్మయ్య హత్యకు పథకం రచించాడు. ఇందులో భాగంగా 2021 జూలై 10వ తేదీన సమ్మయ్య తన మనవడు సుప్రీత్‌, గ్రామస్తుడు వీరారెడ్డితో కలిసి వాకింగ్‌ కోసం మైసమ్మ కుంట వద్దకు వెళ్లాడు. అక్కడ యోగా చేస్తుండగా సమ్మయ్యను శంకరయ్య గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. వీరారెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లిచూడగా సమ్మయ్య మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు మడికొండ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో నేరస్తుడు దాడబోయిన శంకరయ్యకు జీవిత ఖైదు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్జి ఎం.కృష్ణమూర్తి తీర్పు వెల్లడించారు. కేసు సీఐ రవికుమార్‌, ఎస్సై ప్రతాప్‌ పరిశోధించగా, ఏఎస్సై కె.పరమేశ్వరి, కానిస్టేబుల్‌ వి.రాజేష్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

పీపీకి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు..

ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ మోకాళ్ల సత్యనారాయణగౌడ్‌కు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఙతలు తెలిపారు. సాక్షులకు మనోధైర్యం కల్పించి వారిని కోర్టులో ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా వాదించిన సత్యనారాయణగౌడ్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు కేసు విషయంలో బాధ్యత వహించిన పోలీస్‌ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

రూ. 5వేల జరిమానా

Advertisement
Advertisement