ఆ‘శక్తి’ తగ్గిపోయిందా! | Sakshi
Sakshi News home page

ఆ‘శక్తి’ తగ్గిపోయిందా!

Published Fri, May 24 2024 10:20 AM

ఆ‘శక్తి’ తగ్గిపోయిందా!

సీ్త్ర పురుషుల్లో సంతానలేమి సమస్యలు

తీవ్రమైన మానసిక ఒత్తిడే కారణం

సీ్త్రలలో ఊబకాయం, పీసీఓడీ సమస్యలు

సంతానం కోసం వైద్యుల వద్ద క్యూ

కర్నూలు(హాస్పిటల్‌): ఆధునిక అలవాట్లు, తీరిక లేని ఉద్యోగాలు, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా పురుషుల్లో శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా సంతానలేమి సమస్యల వారిని తీవ్రంగా వేధిస్తోంది. పెళ్లయి ఎంత కాలమైనా తమకు పిల్లలు కలగడం లేదని వైద్యుల వద్దకు వెళ్లే దంపతుల సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. 50 ఏళ్ల క్రితం యువతలో శుక్రకణాల సంఖ్య పరీక్ష చేస్తే 50 మిలియన్లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి 15 నుంచి 20 మిలియన్లకు పడిపోయాయి. యువతలో శుక్రకణాలు భారీ సంఖ్యలో తగ్గిపోతున్నాయని వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి రెండు తరాల ముందు వారు ఒక్కొక్కరు ఐదారుగురు పిల్లలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడాదికి ఒకరు చొప్పున కనేవారు. కానీ ఇప్పుడు వివాహమై నాలుగేళ్లయినా సంతానానికి నోచుకోవడం లేదు. ఈ మేరకు వైద్యుల చుట్టూ తిరగడం, వారిచ్చిన మందులు మింగడంతోనే సరిపోతోంది. మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో వివాహమైన వారిలో 25 నుంచి 30 శాతం మంది దాకా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. సంతానలేమి సమస్య ఒకప్పుడు 10 జంటల్లో ఒక జంటకు ఉంటే ఇప్పుడు ఆరు జంటల్లో ఒక జంటకు ఉంటోంది. సంతానలేమి సమస్యలున్న వారు పెరుగుతుండటంతో డిమాండ్‌కు అనుగుణంగా కర్నూలు నగరంలో ఫెర్టిలిటీ కేంద్రాలు(సంతాన సాఫల్య కేంద్రాలు) సంఖ్య పెరుగుతోంది.

జీవనశైలి మారడంతో ఇబ్బందులు

మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య పోకడల కారణంగా భారతీయుల్లోనూ సంతానలేమి సమస్యలు అధికమవుతున్నాయి. ఒకప్పుడు జన్యుపరంగా, వంశపారంపర్యంగా సంతానలేమి సమస్యలుండేవి. అది కూడా వెయ్యిలో ఒకరో ఇద్దరో ఇలాంటి ఇబ్బందులతో బాధపడేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఆరుగురు జంటల్లో ఒక జంటను ఈ సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా మారిన జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్లు క్రమేపీ మారాయి. సంప్రదాయ ఆహారం స్థానంలో జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ను ఇష్టపడుతున్నారు. అందులో వేసే చైనా సాల్ట్‌, పలు రకాల నిషేదిత రంగులు, వాడిన నూనెను పలుమార్లు వాడటం, ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసుకుని తినడం వంటి కారణాల వల్ల సంతానలేమి సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కోనడం, సరైన నిద్రలేకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి తదితర కారణాలు సంతానలేమి సమస్యకు కారణాలుగా వారు పేర్కొంటున్నారు.

యువతులకు అదో పెద్ద సమస్య

యువతుల్లో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణంగా పీసీవోడీ అని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా గర్భాశయంలో నీటిబుడగలు(పీసీవోడీ) ఏర్పడటం వల్ల సంతానలేమికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొందరు చిన్న వయస్సులోనే రజస్వల అవుతుండగా మరికొందరు పదాహారేళ్లు దాటినా రజస్వల కాని పరిస్థితి నెలకొంది. పీసీవోడీ కారణంగా నెలసరి రావడంలో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నెలనెలా నెలసరి కాకపోవడంతో పాటు నెలసరి వచ్చిన సమయంలో తీవ్ర రక్తస్రావం కూడా జరుగుతూ యువతులను ఇబ్బంది పెడుతోంది. మరికొందరికి గర్భాశయంలో సమస్యలు, లోపాలు ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా అండం పెరుగుదల, అండం విడుదల సక్రమంగా లేకపోవడం, అది ప్రయాణించే మార్గం మూసుకుపోవడం, గర్భాశయ గోడలు పిండం ఎదుగుదలకు అనువుగా లేకపోవడం, గర్భాశయ ముఖద్వారం వీర్యకణాలు లోనికి వెళ్లేందుకు అనువుగా లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి.

పురుషుల్లోనూ సమస్యలు ఎక్కువే!

ఒకప్పుడు సంతానం కలగలేదంటే కేవలం సీ్త్రల వైపు మాత్రమే దృష్టి సారించేవారు. ఎక్కడికి వెళ్లినా ఆమెకే వేధింపులు ఎదురయ్యేవి. మూడు, నాలుగు తరాల క్రితం పిల్లలు కలగడం లేదని ఆత్మహత్య చేసుకున్న మహిళలు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం కారణంగా సీ్త్ర, పురుషులిద్దరికీ పరీక్షలు చేసే వీలు కలిగింది. దీంతో ఎవరిలో లోపం ఉందో ఇట్టే తెలిసిపోతోంది. ఇటీవల కాలంలో పురుషుల్లోనూ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల సంతానలేమి సమస్య ఉత్పన్నమౌతోందని వైద్యులు చెబుతున్నారు. వీర్యకణాలు తగ్గడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్‌కు దారి తీయడంతో పాటు ఆయువు కూడా తగ్గుతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు వీర్యకణాల కదలిక, సారూప్యంలో అధికంగా తేడాలుండటం, వీర్యకణాలు ప్రయాణించే నాళాలు మూసుకుపోవడం, హార్మోన్ల శాతంలో అసమతుల్యత, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్‌కు అలవాటు పడి ఉండటం, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం, నిద్రలేకుండా పనిచేయడం, జన్యుపరమైన లోపాలు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల స్థూలకాయం, ల్యాప్‌టాప్‌ ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వల్ల అధిక వేడి ఉత్పన్నమై సంతానలేమి సమస్యకు దారి తీస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమస్య ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోందని వారు చెబుతున్నారు.

నివారణకు ఇలా చేయాలి

వీలైనంత వరకు సంప్రదాయ

దుస్తులు ధరించాలి.

ఇంట్లో వండిన సంప్రదాయ పిండి

వంటలు, ఆహార పదార్థాలను తినాలి.

జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను

ఒళ్లో పెట్టుకుని పనిచేయకూడదు.

బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ వంటి సమస్యలు

ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి.

ప్రతిరోజూ సమతుల ఆహారం తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement