Sakshi News home page

పేదలకు ఆరోగ్య ‘సిరి’

Published Sat, Nov 11 2023 2:04 AM

ఆరోగ్యశ్రీ కియోస్క్‌ వద్ద చికిత్స పొందిన రోగితో ఆరోగ్యమిత్రలు - Sakshi

ప్రైవేటు ఆసుపత్రుల మెట్టు ఎక్కాలంటే పేదవారికి ధైర్యం చాలని పరిస్థితి. అలాంటిది కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలంటే కలలో పని. అలాంటి ఆలోచనలను నిజం చేశారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. జేబులో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు ఎంత పెద్ద ఆసుపత్రి అయినా ఉచితంగా చికిత్స చేయించుకునే వెసులుబాటు కల్పించారు. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకానికి మరింత వన్నెలద్ది ఇతర రాష్ట్రాలు ఆచరించే విధంగా తీర్చిదిద్దారు.

ఆరోగ్యశ్రీ పథకంలో 3,325కు

పెరిగిన జబ్బులు

ఐదేళ్లలో 2,42,231 మందికి చికిత్స

రూ.502.45 కోట్ల క్లెయిమ్‌

ఇంటి వద్ద విశ్రాంతి తీసుకునే

సమయంలో ఆసర

ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కేసుల వివరాలు

సంవత్సరం నిర్వహించిన క్లెయిమ్‌ మొత్తం

సర్జరీలు రూ.కోట్లలో

2019–2020 35,819 78.21

2020–2021 42,325 99.66

2021–2022 53,459 106.05

2022–2023 60,361 119.13

2023–2024 50,267 99.4

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు కార్పొరేట్‌ హాస్పిటల్‌ అంటే ఏమిటో కూడా తెలియని పేదవాడు ఆ భవనం మెట్టు తొక్కడమే గాకుండా ఆరోగ్యశ్రీ కార్డు జేబులో పెట్టుకుని దర్జాగా అక్కడి బెడ్‌పై పడుకుని చికిత్స అందుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పేద, మధ్యతరగతి వారు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. ఆయన తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. పథకాన్ని పూర్తిగా తీసేసే సాహసం కూడా చేశారు. కానీ పథకంపై ప్రజలకు ఉన్న అభిమానం చూసి వెనక్కి తగ్గారు. పథకం అమలులో పలు రకాల ఆంక్షలు పెడుతూ పేదలకు క్రమంగా దూరం చేసే ప్రయత్నం చేశారు. వైఎస్‌ఆర్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పథకాన్ని మరింత మెరుగ్గా రూపుదిద్దారు. ఐదేళ్ల క్రితం 1800లోపు ఉన్న చికిత్సలను ఇప్పుడు 3,255కు పెంచారు. అంతేగాక ఇతర రాష్ట్రాల వారు ఎవ్వరైనా ఇక్కడ రోడ్డు ప్రమాదానికి గురైతే వారికి ఏ ఆసుపత్రిలోనైనా ఉచితంగా చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు.

ఐదేళ్లలో 2,42,231 మందికి చికిత్స

జిల్లాలో ప్రస్తుతం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 58 ఉన్నాయి. ఇందులో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రులు, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, వెల్దుర్తి, ఓర్వకల్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రితో పాటు 48 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో ఒక డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌, ఒక డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌, ఏడుగురు నెట్‌వర్క్‌ టీమ్‌ లీడర్లు, ఇద్దరు ఆఫీస్‌ అసోసియేట్స్‌, ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ పథకం ద్వారా 2,42,231 మంది చికిత్స అందుకున్నారు. ఇప్పటి వరకు ఆయా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రోగులకు ఉచితంగా చికిత్స అందించినందుకు గాను రూ.502.45కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు ఆసరా పథకం కింద రోజుకు రూ.80కోట్ల వరకు చెల్లించారు.

నిరుపేదలకు కొండంత అండ

ఆరోగ్యశ్రీ పథకం పేదలకు కొండంత అండగా నిలుస్తోంది. ఒకప్పుడు ఏదైనా వ్యాధి వస్తే చికిత్స చేయించుకోవాలంటే డబ్బులు లేకపోవడం వల్ల వెనుకంజ వేసేవారు. దీనివల్ల వ్యాధి ముదిరి ప్రాణం మీదకు వచ్చేది. కొందరి ప్రాణాలు వైద్యం అందకుండానే పోయేవి. ఇలాంటి దుస్థితిని పేదలకు రాకుండా ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మేలు చేస్తోంది. ఈ పథకం కారణంగా చాలా మంది పేదలు ఉచితంగా చికిత్స అందుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.

–డాక్టర్‌ భాస్కరరెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌

Advertisement

What’s your opinion

Advertisement