నూతన వధూవరులకు అమ్మవారి దీవెనలు

- - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన నూతన వధూవరులకు ఆలయ అధికారులు అంతరాలయ దర్శనంతో పాటు వేద ఆశీర్వచనాన్ని ఉచితంగా అందజేశారు. దుర్గగుడి ఈవో కేఎస్‌ రామరావు ఇంద్రకీలాద్రిపై నూతనంగా ప్రవేశపెట్టిన సౌభాగ్యమస్తు కార్యక్రమంలో భాగంగా గురువారం పలువురు నూతన వధువరులకు ఆలయ అర్చకులు అమ్మవారి తరుపున దీవెనలు అందించారు. 200 మంది కొత్త జంటలకు ఆశీర్వచనం అందచేసినట్లు ఆలయ ఏఈవో ఎన్‌. రమేష్‌బాబు పేర్కొన్నారు.

దుర్గమ్మకు బంగారపు తాడు, సూత్రాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన భక్తులు గురువారం బంగారపు తాడు, సూత్రాలను కానుకగా సమర్పించారు. మార్టూరుకు చెందిన శ్రీ మహాలక్ష్మీ సాయి గ్రానైట్స్‌కు చెందిన టి.మల్లికార్జునరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి సుమారు రూ.8.50 లక్షల వ్యయంతో 124 గ్రాముల

బంగారంతో తయారు చేయించిన తాడు, రెండు సూత్రాలను కానుకగా సమర్పించారు. తొలుత దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు, అమ్మవారికి సమర్పించిన బంగారపు తాడు, సూత్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అలంకరించారు. దాతలకు వేద పండితుల ఆశీర్వచనం అందచేయగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఆలయ పర్యవేక్షకులు జగదీష్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.

ఎన్నికల విధులు

సక్రమంగా నిర్వహించాలి

చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికల సంఘం నిబంధనలు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విధులు సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మాస్టర్‌ ట్రైనర్స్‌ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1763 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రిసైడింగ్‌, పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే శిక్షణలో నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి చిన్న విషయం క్షుణ్ణంగా పరిశీలించి తగిన జాగ్రత్త వహించాలన్నారు. శిక్షణ ఇచ్చిన అంశాలపై పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వీటి ద్వారా శిక్షణలో గ్రహించిన విషయాలు ఏ మేరకు అర్థం చేసుకున్నారో తెలుకుంటామని వెల్లడించారు. పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయటం, ఈవీఎం, వీవీ ప్యాట్లు, కంట్రోల్‌ యూనిట్ల కనెక్షన్లు వాటిని వినియోగించే విధానం, మాక్‌ పోలింగ్‌ తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

Election 2024

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top