విద్యార్థిని హత్యపై పెల్లుబుకిన ఆందోళన | Sakshi
Sakshi News home page

విద్యార్థిని హత్యపై పెల్లుబుకిన ఆందోళన

Published Sat, Apr 20 2024 1:40 AM

బళ్లారిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న
బీజేపీ మహిళా మోర్ఛా కార్యకర్తలు  - Sakshi

హుబ్లీ: నగరంలోని బీవీబీ కళాశాల ఆవరణలో గురువారం ఎంసీఏ విద్యార్థిని నేహా హిరేమఠ(24)ను సహ విద్యార్థి ఫయాజ్‌ దారుణంగా హత్య చేసిన ఉదంతంపై ఆందోళన పెల్లుబుకింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జంట నగరాలతో పాటు బళ్లారి, కొప్పళ, హావేరి, గదగ్‌, దావణగెరె, ఇతర ప్రాంతాల్లో యువసంఘాలు, బీజేపీ యువమోర్ఛా, ఏబీవీపీ తదితర సంఘ సంస్థలు కదం తొక్కాయి. నిందితుడు ఫయాజ్‌ను ఒక గంటలోపే పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ రేణుకా సుకుమార మీడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచే కళాశాల ఎదుట భారీ ఎత్తున ఆ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నిందితుడిని తక్షణమే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడి స్వస్థలమైన బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మునవళ్లి పట్టణం బంద్‌ కూడా శుక్రవారం విజయవంతమైంది. మునవళ్లి పంచలింగేశ్వర దేవస్థానం క్రాస్‌ వద్ద యరగట్టి– సవదత్తి రాష్ట్ర రహదారిలో రాస్తారోకో చేపట్టారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల వారు మద్దతు పలికారు. ఈ ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఈరణ్ణ కడాడి నేతృత్వం వహించారు. కాగా చెన్నమ్మ సర్కిల్‌లో మానవహారం ప్రదర్శించి గంటకు పైగా రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేత రోహిత్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎంతో పాటు హోం మంత్రి ఇది వ్యక్తిగత విషయం అంటూ తప్పించుకునేలా నేహా హత్యోదంతంపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని మండిపడ్డారు.

హత్య కేసును తీవ్రంగా పరిగణించాలి

తన కుమార్తె అమాయకురాలు, ప్రేమించాలంటూ నిందితుడు వెంట పడి వేధించే వాడని, తాము గతంలో నిందితుడికి బుద్ధి చెప్పినా ఈ ఘాతకానికి పాల్పడ్డాడని నేహా తండ్రి, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ నిరంజనయ్య హిరేమఠ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం మరే ఆడ పిల్లకు జరగరాదని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నిందితుడికి ఉరిశిక్ష వేయాలి

సాక్షి, బళ్లారి: హుబ్లీలో గురువారం సాయంత్రం కళాశాల విద్యార్థిని నేహా హిరేమఠను దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం బళ్లారిలో వీరశైవ లింగాయత సముదాయం ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేసట్టారు. రైల్వే స్టేషన్‌ పక్కనే ఉన్న మహాత్మా గాధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసి జిల్లాధికారికి వినతి పత్రం సమర్పించారు. వీరశైవ సమాజ ప్రముఖులు హెచ్‌ ఎం గురుసిద్దస్వామి, మంజునాథ్‌, కిరణ్‌కుమార్‌, విరుపాక్షప్ప, వన్ననగౌడ, బండేగౌడ తదితరులు పాల్గొన్నారు.

రాయచూరులో..

రాయచూరు రూరల్‌: హుబ్లీలో బీవీబీ కళాశాలలో విద్యార్థిని నేహా హత్యను ఖండిస్తూ ఏబీవీపీ అందోళన చేపట్టింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు పాండు మాట్లాడారు. కళాశాలను ఆలయంగా కొలిచే ప్రాంగణంలో ఎంసీఏ చదువుతున్న నేహా హిరేమఠను ఫయాజ్‌ అనే విద్యార్థి చాకుతో హత్య చేయడాన్ని ఖండించారు. లవ్‌ జిహాది కోసం నీచ కృత్యానికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

హత్య నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన

బళ్లారిఅర్బన్‌: హుబ్లీలో విద్యార్థిని నేహా హిరేమఠ హత్యను నిరసిస్తూ నగరంలో బీజేపీ మహిళా మోర్ఛా నేతలు, కార్యకర్తలు శుక్రవారం రాత్రి స్థానిక కోర్టు రోడ్డు ఈడిగ హాస్టల్‌ వద్ద నుంచి రాయల్‌ సర్కిల్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. బీజేపీ మహిళ మోర్ఛా పదాధికారులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తు నినాదాలు చేశారు. జిల్లా బీజేపీ మహిళా మోర్ఛా అధ్యక్షురాలు సుగుణ, సాధన హిరేమఠ, అలివేలు, పుష్ప, హంపీ రమణ, గుత్తిగనూరు విరుపాక్షిగౌడ, రాజీవ్‌, అరుణ్‌బాలచందర్‌, ఓంప్రకాష్‌, సుధాకర్‌, శ్రీనివాస్‌, సిద్దేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement