ఆడపిల్లపై వివక్ష | Sakshi
Sakshi News home page

ఆడపిల్లపై వివక్ష

Published Thu, May 23 2024 4:25 AM

ఆడపిల్లపై వివక్ష

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, మగవారికి దీటుగా ఎదుగుతున్నా వివక్ష మాత్రం తగ్గడం లేదు. కొందరు ఆడపిల్ల అంటేనే భారంగా భావిస్తున్నారు. కొడుకై తే ప్లస్‌ అని, కూతురైతే మైనస్‌ అని లెక్కలేసుకుంటూ.. పుట్టబోయేది ఆడబిడ్డని తెలిస్తే చాలు కడుపులోనే ప్రాణం తీసేస్తున్నారు. దీంతో జిల్లాలో బాలబాలికల నిష్పత్తి ఆందోళన కలిగించేలా తగ్గిపోతోంది. – సాక్షి, కామారెడ్డి

మార్పు రాకుంటే కష్టమే

ఆడపిల్లలు వద్దనుకుని అబార్షన్లు చేయించడం మూలంగా ఆడ, మగ నిష్పత్తి దెబ్బతింటోంది. ఆడపిల్లల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతుండడంతో ఇప్పటికే చాలామంది యువకులకు పెళ్లి కావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌ మరింత భయంకరంగా మారే అవకాశాలున్నాయి. అధికారులు స్పందించి స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెంచడంతోపాటు ఆడపిల్లలపై వివక్ష అంతానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

జిల్లా జనాభా లెక్కలు చూసినా, జిల్లా ఓటర్ల లెక్కలను గమనించినా ఆడవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆడపిల్లలపై వివక్ష పెరిగిపోయి జననాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఆడ, మగ నిష్పత్తి క్రమంగా దెబ్బతింటోంది. జిల్లాలో గతేడాది 11,303 జననాలు నమోదయ్యాయి. ఇందులో 6 వేల మంది మగ సంతానం కాగా 5,304 మాత్రమే ఆడపిల్లలున్నారు. అంటే మగవారికన్నా 696 మంది ఆడపిల్లలు తక్కువగా జన్మించారు. ఐదారేళ్లుగా ఆడపిల్లల నిష్పత్తి పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

స్కానింగ్‌తో తెలుసుకుని..

జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. చట్టప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసినా.. పలు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి పరీక్షలు చేస్తూ కడుపులో పెరుగుతోంది ఆడో, మగో ముందే చెప్పేస్తున్నారు. ఆడపిల్ల వద్దనుకునే వారే ఎక్కువగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటుండడంతో.. పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌ చేయిస్తున్నారు. జిల్లా యంత్రాంగం అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్లు చేస్తున్న విషయం జిల్లా యంత్రాంగానికి తెలిసినా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. డబ్బులకు ఆశపడి ఆస్పత్రుల నిర్వాహకులు అబార్షన్లు చేస్తున్నా అడ్డుకునేవారు లేకుండాపోయారు.

ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా గతేడాది నమోదైన జననాల వివరాలు..

ప్రాజెక్టు బాలికలు బాలురు మొత్తం వ్యత్యాసం

బాన్సువాడ 1,037 1,136 2,173 99

దోమకొండ 991 1,164 2,155 173

కామారెడ్డి 1,253 1,438 2,691 185

మద్నూర్‌ 912 1,022 1,934 110

ఎల్లారెడ్డి 1,111 1,240 2,351 129

మొత్తం 5,304 6,000 11,304 696

యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు

ఆడపిల్ల అని తెలిస్తే పుట్టక ముందే

చంపేస్తున్న వైనం

జిల్లాలో పడిపోతున్న ఆడ, మగ నిష్పత్తి

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

Advertisement
 
Advertisement
 
Advertisement