సాగుకు సన్నద్ధం | Sakshi
Sakshi News home page

సాగుకు సన్నద్ధం

Published Wed, May 22 2024 10:55 AM

సాగుక

భూపాలపల్లి రూరల్‌: వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ సారి వానాకాలంలో 2,48,270 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పత్తి, మిర్చి, వరికి ప్రాధాన్యత ఇచ్చారు. పంటల అంచనాకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో గతేడాది 91,510 ఎకరాల్లో పత్తి, 24,360 ఎకరాల్లో మిర్చి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 1,01,500 ఎకరాల్లో పత్తి, 25,800 ఎకరాల్లో మిర్చి సాగుకు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పత్తి విత్తనాల ప్యాకెట్‌లను ప్రైవేట్‌ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది మొదట్లో మిర్చితో పాటు పత్తికి అనుకూలమైన ధర పలికింది. పెద్దమొత్తంలో లాభాలు రాకపోయినా పెట్టుబడి మాత్రం వస్తుందనే నమ్మకంతోనే రైతులు ఈ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు.

ఎరువులు, విత్తనాల అంచనా..

జిల్లాలో 2,48,270 ఎకరాల సాగుకు గాను 36,203 టన్నుల యూరియా, 11,511 టన్నుల డీఏపీ, 11,511 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులతో పాటు 6,444 టన్నుల పొటాష్‌ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాగుకు వరి, పత్తి తదితర విత్తనాలను డిమాండ్‌ మేర సరఫరా చేస్తామని అధికారులు చెపుతున్నారు. 2,29,470 క్వింటాల విత్తనాలు కావాల్సి ఉండగా 10,556 క్వింటాల విత్తనాలు రైతుల దగ్గర ఉన్నాయని, 2,18,913 క్వింటాలు కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఏది..

జిల్లాలో చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు జిల్లాలో పండించడం లేదు. ఐదేళ్ల క్రితం మొగుళ్లపల్లి, చిట్యాల మండలాల్లో ఆత్మ పథకం ద్వారా పరిమితంగా రైతులు సజ్జలు, కొర్రలు పండించారు. ఈ సారి చిరుధాన్య పంటలకు ప్రాధాన్యం లేనట్లే ఉంది.

అవగాహన

కార్యక్రమాలేవి..

నాసిరకం విత్తనాలు, సేంద్రియ వ్యవసాయంపై రైతు చైతన్య యాత్రల పేరిట గతంలో మే నెలలో రైతులకు వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించేవారు. నాలుగేళ్లుగా అవగహన కల్పించడం లేదు.

విత్తనాలు, ఎరువులు సిద్ధం

విత్తనాలు, ఎరువులు డిమాండ్‌ మేర సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటాం. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్‌ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు, మందులు కోనుగోలు చేయాలి. భూసారాన్ని పెంచుకునేందుకు వీలుగా జీలుగ విత్తనాలు జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు జీలుగ విత్తనాలను చల్లి భూసారాన్ని పెంచుకునే విధంగా చర్యలు చేపట్టాలి.

– విజయ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

సాగు అంచనా (ఎకరాల్లో)

పంట గతేడాది ప్రస్తుతం

అంచనా

వరి 1,10,899 1,05,000

పత్తి 91,510 1,01,500

మిర్చి 24360 25,800

మొక్కజొన్న 93 250

పెసర 116 250

కంది 57 20

మినుము 11 350

వేరుశనగ 00 50

ఆయిల్‌పామ్‌ 3,186 6,500

ఇతర పంటలు 12,961 8,550

2,48,270 ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు

పత్తి, మిర్చి, వరికి ప్రాధాన్యం

పంటలకు అనుగుణంగా

ఎరువులు, విత్తనాలు

అవగాహన సదస్సులు కరువు

సాగుకు సన్నద్ధం
1/1

సాగుకు సన్నద్ధం

Advertisement
 
Advertisement
 
Advertisement