గందరగోళంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం | Sakshi
Sakshi News home page

గందరగోళంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

Published Thu, Nov 30 2023 1:40 AM

 అధికారితో ఉపాధ్యాయుల వాగ్వాదం - Sakshi

● ఎన్నికల అధికారులతో ఉపాధ్యాయ ఓటర్ల వాగ్వాదం ● ఎట్టకేలకు ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

పెద్దపల్లిరూరల్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం ఈసారి ఎన్నికల్లో కొంత గందరగోళానికి దారి తీసింది. పోస్టల్‌ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు తమకు ఓటేసే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదంటూ ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌లో తమ పేర్లు ఎందుకు లేవని, తాము చేసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పాలంటూ ధర్మారం మండలానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు ఎన్నికల అధికారులతో వాదనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. అయితే ఉపాధ్యాయుల సొంత గ్రామం ఓ నియోజకవర్గం.. పని చేసే ప్రాంతం మరోచోట.. ఎన్నికల విధులు నిర్వహించేది మరోటి కావడం వల్లే ఎన్నికల అధికారుల సమన్వయ లోపంతోనే ఇలా జరిగిందని ఓ అధికారి పేర్కొన్నారు. అయితే వీలైనంత మేర మళ్లీ ఉపాధ్యాయుల నుంచి ఫారం12డీ తీసుకొని ఓటు హక్కును కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కేంద్రంలో 1,117 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వినియోగించుకున్నట్లు అధికారులు వివరించారు.

గడువు పెంచాలని డిమాండ్‌

ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు గడువు పెంచాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు అశోక్‌రెడ్డి, రాంకిషన్‌రావు, లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 15రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నా.. ఓటు హక్కు వినియోగించుకోకుండా ఎందుకు చేశారన్నది అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు ఉద్యోగ, ఉపాధ్యాయులకు డిసెంబర్‌ 2 దాకా ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వాలన్నారు.

Advertisement
Advertisement