నేటి నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు

Published Fri, May 24 2024 1:50 PM

నేటి నుంచి ఇంటర్మీడియట్‌  అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు

సాక్షి,సిటీబ్యూరో: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 43,689 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 33,167 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం 135 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారిని నియమించారు. 5 మంది సభ్యులతో కూడిన జిల్లా పరీక్షా కమిటీ, హైపవర్‌ కమిటీ సభ్యుడు మొహమ్మద్‌ అర్షద్‌ సిద్దిఖీ పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. గురువారం పరీక్ష నిర్వహణ పర్యవేక్షణపై ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌లతో ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి డి. ఒడ్డెన్న సమీక్షించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫామ్‌ల్యాండ్స్‌ పేరుతో

రూ. 1.20 కోట్లు టోకరా

బంజారాహిల్స్‌: ఫామ్‌ల్యాండ్స్‌ పేరుతో రూ. 1.20 కోట్లు తీసుకుని తమను మోసం చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు ఓ నిర్మాణ రంగ సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా గ్రూప్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో గుంటుపల్లి శ్రీనివాసరావు, శిల్ప అనే వ్యక్తులు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–10లో కార్యాలయం ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్‌ సమీపంలో తమ సంస్థ ఆధ్వర్యంలో ఫామ్‌ల్యాండ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మి కూకట్‌పల్లి హైదర్‌నగర్‌కు చెందిన సునీత, వనమాల అనే మహిళలు రూ. 1.20 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. 2022లో ప్రాజెక్టు పూర్తవుతుందని, పెట్టుబడి రెట్టింపు చేస్తామని నమ్మించి తమను మోసం చేశారని, సదరు సంస్థను కూడా ఎత్తివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సునీత కుమారుడు పవన్‌కుమార్‌ గురువారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంస్థ ఎండీ గుంటుపల్లి శ్రీనివాసరావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ శిల్పపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులిద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ ఉన్నాయని, వారు పరారీలో ఉన్నట్లుగా బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

గచ్చిబౌలి: సంతానం విషయంలో భార్యతో తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి లోనైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ రాంభూపాల్‌ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా, ఎస్‌ఆర్‌పురం మండలం, చొక్కమడుగు గ్రామానికి చెందిన గోలి కిరణ్‌ కుమార్‌ రెడ్డి(36) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ భార్య శ్రావ్యతో కలిసి గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సంతానం విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి, రెండు రోజుల క్రితం కూడా వారి మధ్య గొడవ జరిగింది. బుధవారం మధ్యాహ్నం శ్రావ్య ఆఫీస్‌కు వెళ్లగా అశ్విన్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం అతడి తండ్రి మురళీధర్‌ రెడ్డి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో కోడలికి ఫోన్‌ చేసి సమాచారంఅందించాడు. దీంతో అమె ఇంటికి వెళ్లి డోర్‌ కొట్టినా అశ్విన్‌ కుమార్‌ స్పందించకపోవడంతో తన వద్ద మరో తాళం చెవితో తలుపులు తెరిచి చూడగా అశ్విన్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దింపి సమీపంలోని కేర్‌ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

7వ నిజాంకు ఘన నివాళి...

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 58వ వర్ధంతి సందర్భంగా అసఫ్‌ జాహీ రాజ వంశస్తుడు, నిజాం వారసుడు రౌనక్‌ యార్‌ ఖాన్‌ నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా కింగ్‌ కోఠి మస్జిద్‌–ఎ–జూడీలోని 7వ నిజాం విశ్రాంతి స్థలంలో తన వంశస్తులు, కుటుంబ సభ్యులతో కలిసి సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రౌనక్‌ యార్‌ ఖాన్‌ మాట్లాడుతూ., లౌకిక పాలన అందించిన మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఆదర్శప్రాయుడని కొనియాడారు. అన్ని వర్గాల వారు ఇప్పటికీ ఆయన సేవలను స్మరించుకుంటున్నారన్నారు. నిజాం నిర్మించిన మసీదులు, అషూర్ఖానాలతో పాటు ఇతర కట్టడాలను సంరక్షించడం, తమ వంశస్తుల సమస్యలను పరిరక్షించాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలిపారు.

అన్నోజిగూడలో చైన్‌ స్నాచింగ్‌

పోచారం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లిన సంఘటన పోచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్‌ఎఫ్‌సీనగర్‌కు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని ఎర్రి శ్రీజ (20) తన తల్లి సునీతతో కలిసి గురువారం ద్విచక్ర వాహనంపై జోడిమెట్ల నుండి ఘట్‌కేసర్‌ వెళ్తున్నారు. ఎన్నోజిగూడ ఫ్లైఓవర్‌ మధ్యలోకి రాగానే గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ వచ్చి వెనక కూర్చున్న శ్రీజ మెడలోని తులం బరువు ఉన్న బంగారం గొలుసును లాక్కెళ్లారు. తల్లీకూతుళ్లు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని సమీపంలోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement