మహారాష్ట్ర గ్యాంగ్‌ పనే? | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర గ్యాంగ్‌ పనే?

Published Mon, May 29 2023 8:00 AM

- - Sakshi

హైదరాబాద్: ఐటీ అధికారులమంటూ కిలో 700 గ్రాముల బంగారు నగలు దోచుకున్న ఘటనలో మార్కెట్‌ పోలీసులు నిందితులకు చెందిన కీలకమైన వివరాలు సేకరించారు. నిందితులు మహారాష్ట్ర థానేకు చెందిన గ్యాంగ్‌గా దర్యాప్తులో గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందాలు ముంబై చేరుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. శనివారం సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌ నవకార్‌ కాంప్లెక్స్‌లోని బంగారు నగల మెల్టింగ్‌ కార్ఖానాలో ఐటీ అధికారులమని చెప్పి కిలో 700 గ్రాముల ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ లాడ్జీలో బస
ఈ నెల 24 ఈ ముఠా నగరానికి చేరుకుని ప్యాట్నీ సెంటర్‌లోని ఢిల్లీ లాడ్జీలో గదులు తీసుకుని మకాం వేసింది. ఆ రోజు నుంచి పలుమార్లు పాట్‌ మార్కెట్‌లోని కార్ఖానాకు వెళ్లి రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం 8 మంది వచ్చినప్పటికీ ఘటనలో మాత్రం నలుగురు మాత్రమే పాలుపంచుకుని మిగతా వాళ్లు చుట్టు పక్కల ప్రాంతాల్లో కాపలా కాస్తూ ఉన్నారు. పని పూర్తి కాగానే నిందితులు ఘటనా స్థలం నుంచి ఆటోలో కూకట్‌పల్లి వరకు వెళ్లారు. అటు తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్రకు చెందిన బస్సు ఎక్కి వెళ్లిపోయారు. సంఘటనా స్థలం నుంచి సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించగా నిందితులు అటుగా వెళ్లినట్లు తేలింది. నిందితులు గతంలో బంగారం షాపుల్లో పనిచేసి ముఠాగా ఏర్పడి ఉండవచ్చని, కొంత మంది పాత నేరస్తులు కూడా ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల గురించి మరింత ఆరా తీసేందుకు ఢిల్లీ లాడ్జీలో పనిచేసే ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఉప్పందించిందెవరు?
నిందితులు కేవలం ఒకటే షాపును టార్గెట్‌ చేసికుని మహారాష్ట్ర నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క షాపుపైనే రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అయితే మహారాష్ట్ర గ్యాంగుకు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఉంటుందని ఎవరు ఉప్పందించారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని యజమానికి చెందిన సిద్ధివినాయక జ్యువెలర్స్‌లో పనిచేసే ఓ వ్యక్తిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇటీవలే రెండు కిలోల బంగారు ఆభరణాలు ఒకేసారి మెల్టింగ్‌ చేసేందుకు పాట్‌ మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఇదే సమాచారాన్ని నిందితులకు ఇక్కడి వారే సమాచారమిచ్చి ఉంటారని, అందుకే పకడ్బందీగా పథకం వేసుకుని వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. పాట్‌మార్కెట్‌ కార్ఖానాలో పనిచేసే నలుగురిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
Advertisement