Sakshi News home page

మత్స్యకార జీవితాల్లో వెలుగులు

Published Tue, Nov 21 2023 11:32 PM

- - Sakshi

తాళ్లరేవు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ అధ్యక్షతన కోరంగిలో మంగళవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభ నిర్వహించారు. ఓఎన్‌జీసీ కార్యకలాపాలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో.. ఆ సంస్థ నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకు రూ.161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారులైన మత్స్యకారుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ చేశారు.

ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా వీక్షించిన అనంతరం కోరంగిలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి విశ్వరూప్‌ ప్రసంగించారు. మత్స్యకారుల సంక్షేమానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఎక్కువ లబ్ధి చేకూర్చిందని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సామాజిక సాధికారత సాధ్యమన్నారు. నలుగురు బీసీ నేతలను రాజ్యసభకు పంపడంతో పాటు ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఏకై క ముఖ్యమంత్రి జగన్‌ అని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తన పాలనలో పేదల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేవలం 14 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తూ పేదల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని అన్నారు. అలాగే 2014 ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక కనీసం వెయ్యి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆయన కుమారుడికి మాత్రం మంత్రి పదవి ఇచ్చుకున్నారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లోపే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఒక రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకై క నాయకుడు జగనేనని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు రాజ్యసభ వంటి పదవులను వందల కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని, దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అన్నింటా పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, పేదవాడు ఎవరి వద్దా చేయి చాచకుండా, అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకై క సీఎం జగన్‌ అని అన్నారు. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తేవడంతో పాటు ఎటువంటి వివక్షా లేకుండా ప్రతి పేదకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని అన్నారు. మత్స్యకారులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వకపోతే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందజేసిందని గుర్తు చేశారు. ఓఎన్‌జీసీ నిధులు ఇవ్వడం ఆలస్యం చేసినా.. ప్రభుత్వ పరంగా ఇద్దామని చెప్పిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు.

తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని మంత్రి విశ్వరూప్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎంపీలు మోపిదేవి, వంగా గీత, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ తదితరులు 23,458 మంది లబ్ధిదారులకు ఓఎన్‌జీసీ నష్టపరిహారం నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కర్రి పద్మశ్రీ, కోనసీమ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌, మత్స్యశాఖ జేడీ షేక్‌ లాలా మహ్మద్‌, కాకినాడ ఆర్‌డీఓ ఇట్ల కిషోర్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బొర్రా అనుబాబు, మేరుగు పద్మలత తదితరులు పాల్గొన్నారు.

ఫ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే

వారికి అధికంగా లబ్ధి

ఫ వారి సంక్షేమానికి పెద్దపీట

ఫ కోరంగి మత్స్యకార దినోత్సవ

సభలో మంత్రి విశ్వరూప్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement