సెన్సెక్స్‌- నిఫ్టీ.. జోడు గుర్రాలు | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌- నిఫ్టీ.. జోడు గుర్రాలు

Published Tue, Aug 4 2020 3:59 PM

Market high jump - Nifty crosses 11000 point mark - Sakshi

ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌ కదం తొక్కింది. ఇందుకు ప్రపంచ సంకేతాలు తోడవడంతో మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. రెండు రోజుల తదుపరి బుల్‌ ఆపరేటర్లు పైచేయి సాధించడంతో సెన్సెక్స్‌ 748 పాయింట్లు ఎగసింది. 37,688 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 204 పాయింట్లు దూసుకెళ్లి 11,095 వద్ద నిలిచింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మార్క్‌ను సులభంగా అధిగమించింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సమయం గడిచేకొద్దీ బేర్‌ ఆపరేటర్లు పొజిషన్లు కవర్‌ చేసుకోవలసి వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు దాదాపు ఇంట్రాడేలకు సమీపంలోనే స్థిరపడినట్లు తెలియజేశారు. సెన్సెక్స్‌ 37,746 సమీపంలో గరిష్టాన్ని చేరగా.. 36,988 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. నిఫ్టీ 11,112- 10,908 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

ఐటీ నేలచూపు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఆటో, రియల్టీ, ఫార్మా, మెటల్‌ రంగాలు 4-1 శాతం మధ్య ఎగశాయి. ఐటీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇండెక్స్‌ హెవీవెయిట్స్‌ ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తోపాటు..  జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, యాక్సిస్‌, హీరో మోటో,  హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ 7.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. దీంతో మార్కెట్లకు బలమొచ్చింది. అయితే టెక్‌ మహీంద్రా, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌, గెయిల్‌,  అల్ట్రాటెక్‌, ఇన్ఫోసిస్‌,హెచ్‌యూఎల్‌ 3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

అపోలో టైర్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో అపోలో టైర్‌, అదానీ ఎంటర్‌, అపోలో హాస్పిటల్స్‌, ఆర్‌బీఎల్‌, టొరంట్‌ ఫార్మా, జూబిలెంట్‌ ఫుడ్‌, బీఈఎల్‌, టాటా కన్జూమర్‌ 7-3.5 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. మరోవైపు శ్రీరామ్‌ ట్రాన్స్‌, గోద్రెజ్‌ సీపీ, హెచ్‌పీసీఎల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, పెట్రోనెట్‌, ఐజీఎల్‌, ఐడియా 3-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,705 లాభపడగా.. 936 మాత్రమే నష్టాలతో నిలిచాయి.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 7818 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశారు. వీటిలో బంధన్‌ బ్యాంకులో వాటా కొనుగోలు పెట్టుబడులు కలసి ఉండవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 136 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా..  వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 959 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 443 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. 

Advertisement
Advertisement