ఈసీ మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు | Sakshi
Sakshi News home page

ఈసీ మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు

Published Wed, May 22 2024 9:50 AM

ఈసీ మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

బాపట్ల: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలను ఆయన ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆరు నియోజకవర్గాల ఈవీఎంలు ఉన్న గదులను పరిశీలించి, దస్త్రాలు తనిఖీ చేశారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్ట భద్రత కొనసాగించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లు వచ్చేందుకు మార్గాలు ఏర్పాటు చేసి, బారికేడ్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరినీ కళాశాల ప్రాంగణం వైపు రానివ్వకూడదని స్పష్టం చేశారు. పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించేలా వెబ్‌ కాస్టింగ్‌ కంట్రోల్‌ రూం నడిపించాలని, అక్కడే మీడియా సెంటరు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి కొంత దూరంలో వాహనాల పార్కింగ్‌ స్థలం ఎంపిక చేయాలని ఎస్పీకి సూచించారు. మూడంచల భద్రతపై అధికారులను కలెక్టర్‌ రంజిత్‌ బాషా అప్రమత్తం చేశారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీవో జి.రవీందర్‌, అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement