ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌

Published Wed, May 22 2024 9:50 AM

ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌

బాపట్లటౌన్‌: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కోరారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్‌ రోజు జూన్‌ 4న జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమస్యాత్మక గ్రామాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో, ప్రధాన కూడళ్లలో పోలీస్‌ బలగాలతో పికెట్‌లు ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిలు వాహనాల్లో మాత్రమే నింపాలని, విడిగా బాటిల్స్‌లో పోయరాదని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు బాణ సంచా కాల్చడానికి అనుమతి లేదని, ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు బాణ సంచా విక్రయించకూడదన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం, సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం, వదంతులు ప్రచారం చేయడం నేరమని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పోలీసు అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలను కోరారు.

ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిలేదు

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ వేళ పటిష్ట బందోబస్తు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement