బాణసంచా.. బీ కేర్‌ఫుల్‌ | Sakshi
Sakshi News home page

బాణసంచా.. బీ కేర్‌ఫుల్‌

Published Fri, Nov 10 2023 5:32 AM

గుంటూరు డాన్‌బాస్కో స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న బాణసంచా దుకాణాలు  - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: దీపావళి పండుగ మరో మూడు రోజుల్లో ఉండటంతో బాణసంచా విక్రయాలకు రంగం సిద్ధమవుతోంది. తాత్కాలిక షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 187 షాపులకు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. గుంటూరు నగరంలో డాన్‌బాస్కో స్కూల్‌లో 15 షాపులు, విజ్ఞాన మందిరంలో రెండు, ఇతర చోట్ల నాలుగు, గుంటగ్రౌండ్స్‌లో 23 షాపులకు అనుమతిచ్చారు. పొన్నూరు పట్టణంలో భావన్నారాయణ గుడి వద్ద ఎనిమిది షాపులు, రూరల్‌లో రెండు షాపులు, మంగళగిరి న్యూ బ్యాంక్‌ కాలనీ గ్రౌండ్‌, తాడేపల్లి గుడ్‌న్యూస్‌ హైస్కూల్‌, ఉండవల్లిలో కలిపి 40 వరకూ షాపులకు అనుమతులు ఇచ్చారు. తెనాలి పట్టణంలోని తాలూకా సెంటర్‌లో 36, పాత ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆరు, గ్రామీణ ప్రాంతంలో 41 కలిపి జిల్లా వ్యాప్తంగా 187 షాపులకు బుధవారం సాయంత్రం వరకూ అనుమతులు ఇచ్చారు.

నిబంధనలు కఠినతరం

గత ఏడాది విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడటంతో ఈ ఏడాది అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. జిల్లా కేంద్రంలో జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌, గ్రామీణ ప్రాంతాలలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ తాత్కాలిక అనుమతులు ఇస్తున్నారు. దీనికోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించారు. ఇప్పటికే కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి జిల్లా అధికారులు, హోల్‌సేల్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో రోడ్లపై బాణసంచా అమ్మకాలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

వ్యాపారులకు నిర్దేశించిన నిబంధనలు ఇవే..

● షాపులు ఖాళీ ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేయాలి.

● జనావాసాలకు దూరంగా ఉన్న ఒక అంతస్తు మాత్రమే ఉండే భవనాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు.

● దుకాణానికి, దుకాణానికి మధ్య ఖాళీ ఉండాలి.

● అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

● ప్రమావశాత్తూ మంటలు చెలరేగితే తక్షణం నియంత్రించేలా ఏర్పాట్లు ఉండాలి.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

● లైసెన్స్‌డ్‌ షాపుల నుంచే బాణసంచా కొనాలి.

● అగ్ని ప్రమాదాలు జరగని ప్రదేశంలో వీటిని భద్రపరచాలి.

● బాణసంచా కాల్చే సమయంలో వాటిపై ఉన్న నిబంధనలు చదివి పాటించాలి.

● ఖాళీ ప్రదేశాల్లోనే కాల్చాలి.

● బాణసంచా కాల్చేటప్పుడు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.

● కాటన్‌ దుస్తులే ధరించాలి.

● కచ్చితంగా చెప్పులు ధరించాలి

● జనావాసాలు, రద్దీ ప్రాంతాలలో పెద్దపెద్ద టపాసులు కాల్చరాదు

● పెద్దల పర్యవేక్షణలోనే చిన్నపిల్లలు బాణసంచా కాల్చాలి.

● కాలని క్రాకర్స్‌ వద్దకు వెళ్లి దాన్ని చేతులతో పరీక్షించవద్దు.

● బాంబుల వంటి వాటిని చేతితో పట్టుకుని కాల్చవద్దు.

● లూజుగా ఉండే దుస్తులు ధరించరాదు.

● సొంతంగా తయారు చేసిన బాణసంచాను కాల్చే యత్నం చేయవద్దు.

ముందు జాగ్రత్తలు అవసరం

తాత్కాలిక షాపులు

కేటాయింపు ప్రక్రియ ప్రారంభం

ఇప్పటికే జిల్లాలో 187

షాపుల కేటాయింపు

ఏర్పాట్లలో వ్యాపారులు బిజీ

ప్రజలూ జాగ్రత్తలు తీసుకోవాలి

దీపావళి బాణ సంచా కాల్చే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈసారి షాపుల కేటాయింపు విషయంలో కూడా ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. షాపులు పెట్టే ప్రదేశాల్లో అగ్నిమాపక శాఖ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది.

ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

1/1

Advertisement
Advertisement