బలపడిన నైరుతి రుతుపవనాలు | Sakshi
Sakshi News home page

బలపడిన నైరుతి రుతుపవనాలు

Published Sun, Jun 26 2022 7:50 AM

Rains Across AP State For The Next Five Days - Sakshi

సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించి బలపడడంతో వచ్చే ఐదు రోజులూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా వర్షాలుపడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో చాలాచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మంచి వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం స్వల్పంగా వర్షాలు పడనున్నాయి. 

సీజన్‌ ఆరంభంలో రాయలసీమలో ఫుల్‌ వర్షాలు
సాధారణంగా సీజన్‌ ప్రారంభంలో ఉత్తరాంధ్రలో వర్షాలు పడడం ఆనవాయితీ. ఆ తర్వాత నెమ్మదిగా మిగిలిన కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో వర్షాలు కురిసేవి. కానీ, ఈసారి ముందుగా రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీగా కురిశాయి. అదే సమయంలో కోస్తా ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో జూన్‌లో కురవాల్సినంత వర్షం కురవలేదు. కానీ, వచ్చే వారం రోజులు కోస్తాలో వర్షాలు పెరిగి రాయలసీమలో తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పసిఫిక్‌ మహా సముద్రంలో లానినో పరిస్థితులు కొనసాగుతున్నాయని, రాబోయే కొద్దినెలలు ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

దీనివల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు మన వాతావరణంపై ప్రభావం చూపనున్నాయి. వీటి పర్యవసానంగానే రుతుపవనాలు బలపడి ఈ సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 4.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో సగటున 21.4 మి.మీ. అత్యధిక వర్షం కురిసింది. అన్నమయ్య జిల్లాలో 17.4, ఏలూరు జిల్లాలో 15.6, శ్రీకాకుళం జిల్లాలో 9.5, విజయనగరం జిల్లాలో 9.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా జామి మండలంలో సగటున 95.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా శృంగవరపుకోట మండలంలో 67.1, బొందపల్లిలో 51, నెల్లిమర్లలో 41.2,  శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో 63.6, వజ్రపుకొత్తూరు మండలంలో 58, రణస్థలం మండలంలో 54.4, ఎచ్చర్ల మండలంలో 47.4, లావేరు మండలంలో 42.6, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో 39.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

Advertisement
Advertisement