సాగులో సలహాలు తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

సాగులో సలహాలు తీసుకోవాలి

Published Sat, May 25 2024 4:35 PM

సాగులో సలహాలు తీసుకోవాలి

గుమ్మఘట్ట: రైతులు సాగు సమయంలో అధికారుల సలహాలు, సూచనలను పరిగణనలో తీసుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. మండల కేంద్రం గుమ్మఘట్టలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశనగ పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి రైతుకూ సబ్సిడీతో విత్తన వేరుశనగ అందించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆలిండియా రేడియోలో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రవేశపెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మను ఆదేశించారు. ముందస్తుగా వర్షాలు కురుస్తున్న తరుణంలో రైతులు పొలాలను దుక్కిచేసుకోవాలని సూచించారు. సజ్జ, ఆముదం, ఉలవ, కొర్రలు, కందులు, పత్తి, పెసలు, అలసంద తదితర విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు కృషి చేయాలని పలువురు రైతులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, ఆర్డీఓ సుస్మితరాణి, ఏడీఏ లక్ష్మానాయక్‌, ఏపీ సీడ్స్‌ మేనేజర్‌ సుబ్బయ్య, ఎంపీడీఓ గౌరీదేవి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఏఓ నిర్మల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సబ్సిడీ విత్తన పంపిణీ ప్రారంభం

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 40 శాతం రాయితీపై విత్తన వేరుశనగ కాయల పంపిణీ ప్రారంభమైంది. గుమ్మఘట్టలో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ లాంఛనంగా ప్రారంభించగా మిగతా ప్రాంతాల్లో ఏడీఏలు, ఏఓలు, ఏపీ సీడ్స్‌ అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ జరిగిందని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. 388 ఆర్‌బీకేల పరిధిలో 76,710 క్వింటాళ్ల నాణ్యమైన విత్తన వేరుశనగ రైతులకు అందించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకూ విత్తనం అందిస్తామని తెలిపారు. ఒకవైపు విత్తన రిజిస్ట్రేషన్‌, మరోవైపు పంపిణీ కొనసాగిస్తామన్నారు. తొలిరోజు మధ్యాహ్నం తర్వాత పంపిణీ మొదలు పెట్టడంతో విత్తన పంపిణీ తక్కువగానే జరిగినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement