బకాయిలు ఎగ్గొట్టు.. అడ్డదారుల్లో టెండరు పట్టు! | Sakshi
Sakshi News home page

బకాయిలు ఎగ్గొట్టు.. అడ్డదారుల్లో టెండరు పట్టు!

Published Tue, Nov 14 2023 1:24 AM

నేమకల్లు సమీపంలోని కంకర క్వారీ (ఫైల్‌)  - Sakshi

రాయదుర్గం: గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో క్వారీ టెండర్లు దక్కించుకున్న కొందరు.. రూ.62.11 కోట్ల బకాయిలను చెల్లించకుండా మరోసారి టెండర్లు దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 253లో 19 క్వారీలు, 12 స్టోన్‌ క్రషర్ల నిర్వహణకు మైన్స్‌ అండ్‌ జియాలజీ అధికారులు అనుమతులిచ్చారు. ఇందులో మెజార్టీ క్వారీలు టీడీపీ నాయకులే దక్కించుకున్నారు. 2014–19 మధ్య కాలంలో ఓ మంత్రి అండతో ఈ క్వారీలన్నీ టీడీపీ నాయకుడు కాంతారావునే నిర్వహించినట్లుగా ఆరోపణలున్నాయి.

రూ.కోట్లలో రాయల్టీ ఎగవేత

గతేడాది మే నెలాఖరు వరకూ ప్రభుత్వానికి రూ. 7,32,87,603 రాయల్టీని క్వారీ నిర్వాహకులు చెల్లించాల్సి ఉంది. అప్పటికే పరిమితికి మించి తవ్వకాలు చేపట్టడంతో ఐదు రెట్లు పెంచి రూ.53,78,38,125 అపరాధ రుసుంతో మొత్తం రూ.61,11,25,728 చెల్లించాలని క్వారీ నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా బకాయిలు చెల్లించకుండా నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉంటూ వచ్చారు. ఈ మొత్తానికి వడ్డీలు లెక్కిస్తే దాదాపు రూ.100 కోట్లకు చేరి ఉంటుందని అంచనా.

మళ్లీ టెండర్లు దక్కించుకునే కుట్ర

క్వారీలకు టెండర్‌ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైనింగ్‌ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే దాదాపు రూ.100 కోట్ల బకాయిల గంపనెత్తిన ఎత్తుకున్న నిర్వాహకులు.... ఇప్పట్లో ఆ భారం దించుకోవడం సాధ్యం కాదని తెలుసుకుని టెండర్లు దక్కించుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత కాలం తాము నిర్వహిస్తున్న క్వారీల టెండర్లు చేజారకుండా బంధువుల పేరుతో వాటిని దక్కించుకునేందుకు సిద్దమైనట్లు తెలిసింది. దీంతో రికార్డులన్నీ సర్ధుబాటు చేశారనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.

నేడు ప్రజాభిప్రాయ సేకరణ

నేమకల్లు క్వారీల నిర్వహణపై టెండర్ల ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా గ్రామంలో మంగళవారం కాలుష్య నియంత్రణపై అధికారులు సమావేశం నిర్వహించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు. ఇదే విషయాన్ని తహసీల్ధార్‌ శ్రీనివాసులు నిర్ధారించారు. కాగా, టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్దంగా క్వారీల్లో తవ్వకాలు చేపట్టడంతో కాలుష్యం వెదజల్లి మూగజీవాలపై తీవ్ర ప్రభావం చూపింది. పచ్చని పంటపొలాలూ దెబ్బతిన్నాయి. దీంతో తమకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరోమార్గం లేదని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను నేమకల్లు, ఉంతకల్లు ప్రాంత రైతులు ఆశ్రయించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రిబ్యునల్‌ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించే క్వారీ, క్రష్షర్లను నిలిపేయాలని మైనింగ్‌ అఽధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రమాదానికి కారణమైన 17 క్వారీలను అధికారులు మూతేశారు. ఈ నేపథ్యంలో వీటి టెండర్లపై ప్రజలు అభ్యంతరాలు లేవనెత్తే అవకాశమూ లేకపోలేదు.

పేరుకుపోయిన రూ.62.11 కోట్ల బకాయి

నేటికీ చెల్లించని క్వారీ నిర్వాహకులు

బంధువుల పేరుతో అనుమతులు దక్కించుకునే యత్నం

Advertisement
Advertisement