2015 కథలు ఎలా ఉన్నాయి? | Sakshi
Sakshi News home page

2015 కథలు ఎలా ఉన్నాయి?

Published Mon, Jan 4 2016 12:03 AM

2015 కథలు ఎలా ఉన్నాయి?

 (విహంగ వీక్షణం)
 ఆధునిక కథ, ఒక సంధి సమయంలో దారితప్పి తిరిగిన చోటే తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కథలన్నీ ఒకే కొలతలో రంగురంగుల సంఘటనలతో కుట్టిన బొమ్మ వస్త్రాల్లా చూసేందుకు అందంగానే ఉంటాయి, కాని మనసులను ఆకర్షించలేవు. ప్రపంచీకరణ తెచ్చిన మార్పులు, వర్గ విభేదాలు, అణచివేతలు, కుటుంబ సమస్యలు (సామరస్యత పొసగనితనం, వృద్ధాప్యపు విలాపాలు, ప్రేమలు, వైఫల్యాలు), గ్రామీణ సమస్యలు, రైతు ఆత్మహత్యలు, ప్రాంతీయ విద్వేషాలు, మానసిక వైకల్యాలు, మానవతావాదాలు ప్రధానంగా ఇతివృత్తం అవుతున్నాయి.

 మూలమూలలా తడిమి తడిమి ఒక చిన్న సంఘటన నుండి మలచిన కథల నుండి కలగలుపుగా అనేకానేక ఘటనలతో ఉక్కిరిబిక్కిరి చేసే కథలు ఎన్నో వచ్చాయి. జీవితమంత ఇతివృత్తాన్ని చిన్ని కథలో ఇరికించే తాపత్రయాలు కొన్ని. కథే లేకుండా ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ సాగిన కథలు కొన్ని. సంభాషణల ప్రాముఖ్యతతో కదిలిన కథలు కొన్ని. జ్ఞాపకాలుగా సాగినవి కొన్ని. కవితారూపాలై భావుకతకు పట్టం కట్టినవి కొన్ని. నిర్భయ ఆధారంగా అల్లిన కథలు కొన్ని.

 ఇతివృత్తమే కాదు, కథనం కూడా పరిగణనలోకి తీసుకుంటే గతానికీ వర్తమానానికీ మధ్య ముందుకూ వెనక్కీ నడిచేవి కొన్ని. ఈ సంవత్సరపు చాలా కథల్లో గతంలోకి వెళ్లిరావడం కనిపిస్తుంది. కథ చెప్పే విధానాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటూ ఉన్నా, గతపు వాసనలు గతం పట్ల వ్యామోహం కథకుల్లో ఇప్పటికీ ఉంది. ప్రతి నిమిషం మారిపోతున్న అభివృద్ధి, ఆవిష్కరణలు, పరిణామాల నేపథ్యంలో కొత్త వస్తువులు పుట్టుకు వస్తూనే ఉంటాయి. అలా సాహిత్య పరిధిని విస్తృత పరుచుకుంటూ కూడా కొన్ని కథలు వచ్చాయి.
      
 అన్ని రకాల అచ్చు పత్రికలలో, వార్తా పత్రికల ఆదివారపు అనుబంధాలలో, అంతర్జాల పత్రికల్లో సగటున నెలకు రెండు వందలు లెక్కేసుకున్నా, ఏడాదిలో రెండున్నర వేల కథలు అచ్చవుతున్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య కిందే లెక్క!
 మంచికథల కోసం ముందుగా వెతుక్కునేవి ఆంధ్రజ్యోతి ఆదివారం, స్వాతి మాసపత్రిక, అరుణతార. అంతర్జాల పత్రికల్లో ఈమాట, వాకిలి, సారంగ, కినిగె పత్రిక. బతుకమ్మ, ఈనాడు ఆదివారం, ప్రజాశక్తి లాంటివి కూడా మంచి కథలనే అందిస్తున్నాయి. భూమిక, నవ్య, చినుకు కూడా మెరుపుల్లా కొన్ని మంచి కథలను వెదజల్లాయి.

 ఈ సంవత్సరం వచ్చిన మంచి కథల్లో సగానికి సగం అంతర్జాలం పంచుకుంటే, పావుభాగం ఆదివారం అనుబంధాలు పంచుకున్నాయి. తతిమావి వార, మాసపత్రికలు! అయితే, మంచి కథలు ప్రింట్ మాధ్యమంలో వచ్చినా, ఆన్‌లైన్ మాధ్యమంలో వచ్చినా ఆదరణలో పెద్ద తేడా కనబడటం లేదు.
 కథలను స్థూలంగా పరిశీలిస్తే-
 అవిటితనంతో బాధపడినా ఎప్పటికప్పుడు స్ఫూర్తి తెచ్చుకుని, ప్రేమ, బంధాలకంటే తనలోని శక్తి ముఖ్యమని గ్రహించి, జీవనపథంలో విజయానికి సిద్ధం అయ్యే కథ గెలుపు గుర్రం(లక్ష్మీ రాఘవ). వ్యసనాల గురించి సాయి బ్రహ్మానందం గొర్తి రాసిన కథ కాఫీ బానిస. పుట్టా పెంచల్దాసు నిర్భయంగా పాత్రలను నడిపించిన కథ బుడగిత్త రంకి మూడురాళ్ల ముక్కురాయి చుట్టూ కథ నడిపించి సెల్‌ఫోన్‌తో ముగించిన కథ మూడ్రాల్ముక్రాయి(పి.విక్టర్ విజయ్‌కుమార్). బరువైన భావాన్ని బలంగా పొదిగిన చిన్న కథ ఇంకా రెండు రోజులుండవూ(నరుకుర్తి శ్రీధర్). ఈ కథలన్నింటిలో ఒక కొత్తదనం- ఇతివృత్తంలోనో, దృష్టికోణంలోనో, శైలిలోనో కనిపిస్తుంది. ఇక, ఊరవతల ఊడల మర్రి(పి.చిన్నయ్య), అంటరాని బతుకమ్మ(చందు తులసి), కొడుకు (జి.వెంకటకృష్ణ) వంటి కథల్లో తార్కికత, సాలోచన, వాస్తవిక దృక్పథం కనిపిస్తాయి.
 నామిని కథాశైలిని ప్రదర్శించే కథలు రాతి మిద్దాయన చిన్న కుమార్తె వీరో వోండా ఇవి గ్రామీణ జీవనంలోకి లాక్కువెళ్తాయి. ఆహ్లాదకరమైన శైలిలో ఆకట్టుకున్న కథలు దమయంతి రాసిన ఊరికే వీచే గాలులు శేషు మావయ్య నువ్వూ నేనూ ప్రేమ అమ్ములు వీటిలో చక్కని శైలితోపాటు వస్తు వైవిధ్యం కూడా ఉంది.  ఖదీర్‌బాబు మెట్రో కథలు సిరీస్(సాక్షి ఫ్యామిలీ) తమవైన ప్రత్యేక ముద్రతో ప్రత్యేకంగా నిలబడతాయి. మానసిక సంఘర్షణ, మానవ సంబంధాల అవగాహన ఈ కథల్లో కనబడుతుంది.

కుప్పిలి పద్మ మౌనఅతుల్య ఇద్దరు స్త్రీల ప్రేమ, సహజీవనం పర్యవసానాల కథలు. ఇవి భావకవిత్వంతో అలరించే అభ్యుదయం తొంగిచూసే కథలు. ఇవి వ్యక్తిగతంగా అగుపిస్తూనే సామాజిక అంశాలను స్పృశిస్తాయి. కస్తూరి మురళీకృష్ణ క్రైమ్, డిటెక్టివ్ కథలు రాధ మండువ ఎందుకంత దూరం?ఎందుకు వగచేవో?చదివించే కథలకు ఉదాహరణలు. అల్లం వంశీ కథలు సహచరి రెండు పట్టాలు ఒక రైలు అభిమన్యులు కలలో మనుషులు వ్యక్తీకరణలో కొత్తదనం చూపుతాయి.

 గుండె మండితేనూ అక్షరం పదునెక్కుతుంది. మన చుట్టూ సమాజం మనదైనప్పుడు ప్రతి అనుభవమూ గుండెను తాకుతుంది. అది అక్షరరూపం దాల్చటానికి లోలోపల గొప్ప మధనం జరుగుతుంది. దీని ప్రాతిపదికగా వచ్చిన కథల్లో చెప్పుకోదగ్గది అవ్వారి నాగరాజు అతను వొస్తే బాగుండు అరిపిరాల సత్యప్రసాద్ అబ్సలీట్ రియాలిటీ బ్యాక్ స్పేస్ కథలు కొత్తకోణాలు వెదికి వెదికి ఆవిష్కరిస్తే, అఫ్సర్ చమ్కీ పూల గుర్రం సామాజిక స్పృహ, మానసిక అనుబంధాల మధ్య అగాధాన్ని ఎత్తి చూపుతుంది. శ్రీవల్లీ రాధిక అఖండ దర్శనం తాత్వికత చూపే ప్రయత్నం. కె.ఎన్.మల్లీశ్వరి రూబా ఱా పువ్వు సామాజికతను ప్రతీకగా ఉపయోగించి చిత్రించినవి. వెంకట్ సిద్దారెడ్డి కాక్ అండ్ బుల్ స్టోరీ తనదైన సంతకంతో రాసిన కథ. రవి వీరెల్లి గంధపు దండ చక్కని శైలీ శిల్పం సంతరించుకున్నది. సాయి పద్మ గాలికీ కులముంది మంచి ప్రయత్నం. మైథిలి అబ్బరాజు రాజహంస కథాశైలి మనసును ఆకట్టుకునేలా ఉంది. పూడూరి రాజిరెడ్డి మంట వాస్తవిక జీవితంలోంచి, అనుభవంలోంచి ఏ ఆచ్ఛాదనలూ లేకుండా వచ్చిన కథ. చదవగానే ఒక్క స్త్రీ రచయిత్రి అయినా ఇలా రాయగలిగితే ఎంత బాగుండు అనిపించింది.

 చైతన్య పింగళి  తనదైన ఆకాశం స్కైబాబ లవ్ యూ షాహిదా ఒక ప్రయోజనాన్ని ఆశించి జరుగుతున్న చరిత్రను చెప్తాయి. ఎం.హరికిషన్ జీవన స్పర్శమెటీరియలిస్టిగ్గా తయారైన జీవితంలో మనుషుల్ని ప్రేమించడం, దాని అవసరం చెప్పిన కథ. ప్రసూన రవీంద్రన్ పరిపూర్ణం తాడికొండ కె శివకుమార్ శర్మ పెళుసైన అందం ఇండ్ల చంద్రశేఖర్ సుభాషిణి కాదు సుమలత సమాజంలోని వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి. దాట్ల దేవదానం రాజు, అరుణ పప్పు, మమత కొడిదెల, రామా చంద్రమౌళి వంటివారి కథలు సామాజిక సమస్యలను చిత్రిస్తూనే, మానసిక దౌర్బల్యాలకు అద్దం పడతాయి.

చేయి తిరిగిన కథకులు అజయ్‌ప్రసాద్, వనజ తాతినేని, షాజహానా, వారణాసి నాగలక్ష్మి, బండ్లమూడి స్వాతికుమారి, చంద్ర కన్నెగంటి, పూర్ణిమా తమ్మిరెడ్డి, విమల, కృష్ణజ్యోతి కూడా మంచి కథలను అందించారు.
 ఈ కథలన్నీ ప్రస్తావిస్తూపోతే పెద్ద ఉద్గ్రంథం అవుతుంది. ఇదో విహంగ వీక్షణం మాత్రమే. రచయితల్ని పేరుపేరునా ప్రస్తావించకపోయినా వారి సమర్పణా కథకు గొప్ప సంపదే! ఈ సంవత్సరపు కథాయానం ఇలా చరిత్రవైపు సాగి... కొత్త మలుపులకు, కొత్త సొబగులకు, ముఖ్యంగా అజరామరంగా నిలిచిపోగల కొత్త కథలకు కొత్త సంవత్సరంలో ఎదురుచూస్తూ... కథాభినందనలు.

(వ్యాసకర్త: స్వాతి శ్రీపాద, ఆన్‌లైన్ పత్రిక వాకిలి సహ సంపాదకురాలు, 8297248988)

Advertisement
Advertisement