చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి: జగన్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి: జగన్‌

Published Sat, Sep 10 2016 11:48 AM

చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి: జగన్‌ - Sakshi

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, కేవలం ప్రత్యేక సాయం మాత్రమే ఇస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించడం రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజు అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా ప్రత్యేక సాయాన్ని చంద్రబాబు ఎలా స్వాగతిస్తారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఐదున్నరకోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. జైట్లీ ప్రకటనను స్వాగతించి.. ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్న చంద్రబాబు వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ కేంద్ర మంత్రులను ఉపసంహరించాలని ఆయన తేల్చిచెప్పారు.  ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని, ఇందుకు మీడియాతోపాటు ప్రజలందరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్‌ జగన్‌ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు దారుణంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి హోదా వస్తే లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, ప్రత్యేక హోదాపై పోరాడాల్సిన సీఎం చంద్రబాబే దానిని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ జరపాలని ప్రతిపక్షం కోరుతున్నా.. ప్రకటన చేస్తామని మాత్రమే ప్రభుత్వం చెబుతున్నదని, ఈ విషయంలో సీఎం ఎన్నిసార్లు ప్రకటన చేస్తారని వైఎస్‌ జగన్ తప్పుబట్టారు. ప్రతిపక్షం గొంతు కూడా వినాలి అని సూచించారు. ప్రెస్‌ మీట్‌ పెట్టిమరీ జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారని తప్పుబట్టారు. హోదా కోసం ప్రజలు బంద్‌లో పాల్గొంటుండగా.. దానిని విఫలం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, బలవంతంగా బస్సులు నడిపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, అందరినీ కలుపుకొని ఈ పోరాటాన్ని నడిపిస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో ప్రజలకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ పోరాటంలో అందరి మద్దతు కావాలని,  ప్రతి అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మీడియా సహకారం అందించాలని అని వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement