ఏడుగురిని కన్నందుకు 70 లక్షల జరిమానా! | Sakshi
Sakshi News home page

ఏడుగురిని కన్నందుకు 70 లక్షల జరిమానా!

Published Fri, Oct 9 2015 5:25 PM

ఏడుగురిని కన్నందుకు 70 లక్షల జరిమానా!

బీజింగ్: కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాన్ని ఉల్లంఘించి ఏడుగురు పిలల్ని కన్నందుకు ఓ చైనా కుటుంబం పడరాని కష్టాలు పడుతున్నది. చైనాలో ఒకే బిడ్డను కనాలనే వివాదాస్పదమైన విధానం చాలాకాలంగా అమల్లో ఉంది. ఈ పాలసీని ఉల్లంఘించి ఏడుగురు పిల్లల్ని కన్నందుకు ఆ కుటుంబంపై ప్రభుత్వం భారీమొత్తంలో 1,10,180 డాలర్లు (రూ. 71.35 లక్షలు) జరిమానా విధించింది. బీజింగ్లోని టాంగ్ఝౌ జిల్లాకు చెందిన దంపతులకు ముగ్గురు కొడుకులు,  నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఈ కుటుంబానికి 1984 నుంచి జనాభా నమోదు సందర్భంగా నివాస అనుమతిగా ఇచ్చే 'హుకావ్' అనుమతి లేదు. దీంతో ఈ కుటుంబంపై స్థానిక జనాభా, కుటుంబ నియంత్రణ కమిషన్ 7 లక్షల యువాన్ల జరిమానా విధించింది. ఇటీవల కుటుంబ నియంత్రణ విధానం అమలును సరళతరం చేసినప్పటికీ, ఇలా ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తుండటంతో చైనాలో ఆందోళన వ్యక్తమవుతున్నది.

'హుకావ్' అనుమతి ఉంటేనే చైనా పౌరులకు ప్రభుత్వం నుంచి ఉచిత విద్య, ఆరోగ్యరక్షణ, ఇతర సామాజిక సంక్షేమ ఫలాలు అందుతాయి. "హుకావ్' అనుమతి లేకపోవడంతో తన తోబుట్టువులు నలుగురిని ఉన్నత పాఠశాల నుంచి తొలగించారని, ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నవారిని కూడా ఉన్నత పాఠశాలకు వస్తే తొలగించే అవకాశముందని జాంగ్ జెలాంగ్ తెలిపారు. తనకు ఇటీవలే "హుకావ్' అనుమతి వచ్చిందని, అయినా సరైన విద్య లేకపోవడంతో తనకు మంచి ఉద్యోగం దొరకడం కష్టమేనని పేర్కొన్నారు.  


 

Advertisement
Advertisement