‘అర్హత తేదీ’ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం | Sakshi
Sakshi News home page

‘అర్హత తేదీ’ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

Published Sat, Oct 27 2018 1:33 AM

Supreme Court Overturned the DK Aruna Petition - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల నమోదు అర్హత తేదీని ముందు ప్రకటించినట్లు జనవరి 1, 2019ని కాకుండా జనవరి 1, 2018ని అర్హత తేదీగా ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదనలు వినిపించారు. అర్హత తేదీని కుదించడం వల్ల 20 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా పోయా రని తెలిపారు.

అర్హత తేదీని జనవరి 1గా కాకుండా ఏడాదిలో 2 తేదీలు ఉండాలన్న ప్రతిపాదిత బిల్లుపెండింగ్‌లో ఉన్నందున సుప్రీంకోర్టు విచక్షణ అధికారం వినియోగించి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.  శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. అయితే ఈ పిటిషన్‌లో ఆదేశాలు ఇచ్చే ముందు తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌ దాఖ లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూ లు జారీ చేసిందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను  తోసిపుచ్చింది.
 

Advertisement
Advertisement