సభ నిర్వహణకు సర్వశక్తులు | Sakshi
Sakshi News home page

సభ నిర్వహణకు సర్వశక్తులు

Published Tue, Aug 28 2018 2:38 AM

Preparations for Pragathi Nivedhana Sabha - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సెప్టెంబర్‌ 2న నిర్వహించే ప్రగతి నివేదన సభకు గులాబీ దళం సర్వశక్తులొడ్డుతోంది. ఈ సభ దేశ రాజకీయ చరిత్రలోనే సంచలనం సృష్టిస్తుందని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. ఆ పార్టీ అధినాయకత్వం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరిగే బహిరంగసభకు 25 లక్షల మంది తరలిరానున్న నేపథ్యంలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో సభాస్థలిని సిద్ధం చేస్తోంది. రవాణామంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అక్కడే తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు.

బహిరంగసభకు వెళ్లే మార్గాలన్నింటినీ విద్యుదీకరిస్తున్నారు. మరోవైపు ఆర్‌అండ్‌బీ ఇతరత్రా విభాగాలు రోడ్లను చకచకా అభివృద్ధి చేస్తున్నాయి. సభాస్థలికి చేరుకునే దారులను విస్తరించడమేగాకుండా ఆయా మార్గాల్లో పార్కింగ్‌ చేసే ప్రాంతాలను కూడా యుద్ధప్రాతిపదికన చదును చేశాయి. అశేష జనవాహిని తరలివచ్చే సభలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రత్యేక పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన ఆ శాఖ బలగాలను కూడా మోహరించింది. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా వాహనాలను క్రమబద్ధీకరించేందుకు సిబ్బందిని రంగంలోకి దించింది. కొంగరకలాన్‌ పరిసర ప్రాంతాలను జాగిలాలతో జల్లెడ పడుతోంది. పోలీస్‌శాఖ సభాప్రాంగణాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది.  

వాటర్‌ప్రూఫ్‌ వేదిక  
500 గజాల్లో వేదికను నిర్మిస్తున్నారు. వర్షం వచ్చినా కిందకు దిగబడకుండా గట్టితనం కోసం రెండు అడుగుల మేర కాంక్రీటు పరిచారు. 100 అడుగుల ఎత్తు, 160 అడుగుల వెడల్పుతో వేదిక నిర్మాణం చేపట్టారు. వర్షం వచ్చినా తడవకుండా ఉండేందుకు వాటర్‌ ప్రూఫ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై మొత్తం 500 మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

15 పార్కింగ్‌ స్థలాలు
సభకు వచ్చేవారి కోసం ఇప్పటికే పార్కింగ్‌ స్థలాలు గుర్తించినట్లు ప్రభుత్వవిప్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, నగర మేయర్‌ రామ్మోహన్‌ కలసి పార్కింగ్‌స్థలాలు గుర్తించారు. మొత్తం 15 పార్కింగ్‌స్థలాల్లో ముందుగా ఉమ్మడి పది జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించా రు. సుమారు లక్ష వాహనాలు ఇక్కడ ఉండేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉండే 70% వాహనాలు ఇక్కడికి రాబోతున్నాయని తెలిపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి పార్కింగ్‌ స్థలాలను సోమవారం పరిశీలించారు. ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో వచ్చేవారి కోసం పార్కింగ్‌ స్థలాలు కేటాయించామని తెలిపారు. అక్కడే ఉండి వంట చేసుకోవడానికి వీలుగా 12 బోర్ల ద్వారా నీటి వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు. వీఐపీ, మీడియా కోసం ఒక పార్కింగ్, ఫోర్‌ వీలర్‌ వాహనాలకు మరో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. పెద్ద వాహనాలు 20 వేలు, 7 వేల ఆర్టీసీ బస్సులు, 10 వేల వరకు ప్రైవేటు వాహనాలు, 10 వేల డీసీఎంలు, 5 వేల ట్రాక్టర్లు, ఫోర్‌వీలర్‌ వాహనాలు 50 వేలకుపైగా వస్తాయని అంచనా వేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement