అభివృద్ధి పనులు పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

Published Tue, Apr 24 2018 12:29 PM

Kadiyam Srihari Orders To Warangal Officials On Devolopment - Sakshi

కరీమాబాద్‌: నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు చూపించే పరిస్థితిని కల్పించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. నగరంలోని కాకతీయ అర్బన్‌ డెలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) కార్యాలయంలో సోమవారం సాయంత్రం అభివృద్ధి పనులపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ‘కడియం’మాట్లాడారు. రహదారులు, జంక్షన్ల కోసం రూ.కోట్లు మంజూరైనా ఆశించిన మేర పనులు జరగడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏమైనా సమస్యలుంటే కలెక్టర్, కమిషనర్‌లకు తెలియజేయాలన్నారు. సరిగ్గా పనిచేయని కాంట్రాక్టర్లకు నోటీసులివ్వాలని డిప్యూటీ సీఎం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

ఇక నుంచి ప్రతి 15 రోజులకు పనుల పురోగతిపై నివేదికను కలెక్టర్, కమిషనర్‌లకు సమర్పించాలన్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం పనులు జరుగకపోతే సహించేది లేదన్నారు. కడిపికొండ నుంచి వరంగల్‌ ములుగురోడ్‌ వరకు 13 కిలోమీటర్ల రహదారి పనులు ఆశించిన మేర జరగడం లేదని డిప్యూటీ సీఎం అన్నారు.  కడిపికొండ నుంచి బట్టుపల్లి మీదుగా మిగిలిన అసంపూర్తి పనులను మే నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారులను అనుసంధానం చేస్తూ మడికొండ నుంచి ధర్మసాగర్‌ వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ములుగు రోడ్డు, చింతగట్టు వరకు రోడ్డు విస్తరణ పనులు షురూ చేయాలని అన్నారు. గ్రేటర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు మిషన్‌ భగీరథ కింద అనుసంధానం చేస్తూ చేపడుతున్న పనులు జూన్‌ 30లోగా పూర్తి చేసి మరో మూడు వారాల్లో ట్రయల్‌ రన్‌కు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం ‘కడియం’చెప్పారు.

డిసెంబర్‌ 2018 నాటికి మిషన్‌ భగీరథ కింద ఇంటింటికీ 24 గంటలూ నీళ్లందేలా ఇంట్రావిలేజ్‌ పనులు చేయాలన్నారు. అలాగే ‘కుడా’ద్వారా జరుగుతున్న భద్రకాళి, వడ్డేపల్లి చెరువులతో పాటు పబ్లిక్‌ గార్డెన్, ఏకశిలా పార్కు పనురుద్ధరణ పనులు చేయాలని చెప్పారు.ఈ సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి, మునిసిపల్‌ కమిషనర్‌ వీపీ.గౌతమ్‌ వివిధ అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఇదిలా ఉండగా అభివృద్ధి పనుల తీరుపై ఎమ్మెల్యేలు వినయ్‌బాస్కర్, చల్లా ధర్మారెడ్డి, కొండా సురేఖ, ‘కుడా’చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిలు నగరాభివృద్ధి పనుల్లో జరగుతున్న అలసత్వన్ని  శ్రీహరి దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి, వరంగల్‌ గ్రేటర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ వీపీ గౌతమ్, ‘కుడా’చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు  వినయ్‌భాస్కర్, ధర్మారెడ్డి, కొండా సురేఖ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement