చెరువుల ఆక్రమణలపై నివేదిక ఇవ్వండి | Sakshi
Sakshi News home page

చెరువుల ఆక్రమణలపై నివేదిక ఇవ్వండి

Published Tue, Sep 23 2014 2:17 AM

Give the tanks in the report on poaching

జిల్లాల కలెక్టర్లకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, వాటిని నిరోధించడానికి ఏమేం చర్యలు తీసుకున్నారనే వివరాలతో తమకు నివేదిక అందజేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 31కల్లా ఆ నివేదికను తమ ముందుంచాలంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కాప్రా పరిధిలో ఉన్న చెరువులో అక్రమ నిర్మాణాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది.

దీనిని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ ప్రారంభం కాగానే... చెరువుల ఆక్రమణలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చేందుకు వీలుగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా మధ్యాహ్నం కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు చెప్పాలని మీనాను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 

Advertisement
Advertisement