మీ ఫోన్‌ చూసిన మా ప్రచారాలే.. | Sakshi
Sakshi News home page

మీ ఫోన్‌ చూసిన మా ప్రచారాలే..

Published Wed, Nov 21 2018 8:25 AM

Election Campaign By Using Social Media In Warangal - Sakshi

        రోజురోజుకూ ప్రచారం ఉపందుకుంటుంది. బరిలో నిలిచిన నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం సామాన్యుడు ఫోన్‌చూసినా వారే ... టీవీ చూసిన వారే.. వీధిలో ప్రచారాలతో కూడా రాజకీయ నేతలే కనిపిసున్నారు. వాల్‌ రైటింగ్స్, కరపత్రాలు, బ్యానర్ల బదులు సోషల్‌ మీడియాను ప్రచార వేదికగా మార్చుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలువురు నాయకులు ఇప్పటికే విడివిడిగా గ్రూపులు ఏర్పాటు చేసి తమ అభ్యర్థిత్వం, పార్టీ విధానాలపై పోస్టులు పెడుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. 

సాక్షి, వరంగల్‌ రూరల్‌: గతంలో ఎన్నికలు వస్తున్నాయంటే పల్లెల్లో, పట్టణాల్లో వాల్‌రైటింగ్‌లు, కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లకు పరిమితం అయ్యేవి. అభ్యర్థులు, వారి అనుచరులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలని కోరేవారు. ఎన్నికలు వస్తున్నాయంటే పల్లెల్లో, పట్టణాల్లో తెల్లగా ఉండే గోడలు రాతలతో నిండిపోయేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం నిబంధనలతో కొంతమేర తగ్గింది. కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీపై దృష్టిపెట్టారు. మారుమూల గ్రామాల్లో సైతం స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిపోయింది. బరిలో నిలిచిన అభ్యర్థి ఆ ఊరును చుట్టి ప్రచారం చేసి వచ్చే వరకు సోషల్‌ మీడియా ద్వారా నియోజకవర్గంలోని ప్రజలందరికీ చేరవేస్తున్నారు.

ఫలితం ఎక్కువే
ఒకప్పుడు వాల్‌రైటింగ్‌ రాయాలంలే ఆర్టిస్ట్‌ కావాలి, ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలి. ఇలా ఇబ్బందులు పడేవారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థికి అయ్యే ఖర్చులో భాగంగా వాల్‌రైటింగ్, పోస్టర్లు, బ్యానర్లును ఎన్నికల సంఘం వారు లెక్కించి వాటిని అభ్యర్థి ఖర్చులో లెక్కించేవారు. దీంతో అభ్యర్థి తను ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులు కాకుండా ఇవి అదనంగా ఉండేవి. ఖర్చు, శ్రమ తక్కువ అధికంగా ఫలితం కనిపిస్తుండటంతో బరిలో నిలిచే అభ్యర్థులందరూ ఎక్కువగా సోషల్‌ మీడియాపైనే దృష్టిపెట్టారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం అభ్యర్థులకు కలిసొస్తుంది. వారు చెప్పాలనుకున్న అంశాలను కొన్ని సెకన్లలోనే  ఓటర్లకు చేర్చే అవకాశాలను అభ్యర్థులు వినియోగించుకుంటున్నారు.

వాట్సాప్‌.. ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌.. యూట్యూబ్‌
ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు తాము ఓటర్లకు చెప్పాలనుకునే సమాచారాన్ని ఓటరుకు చేరవేసేందుకు సోషల్‌ మీడియాను వినియోగించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హైదారాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థికి చెందిన సమాచారాన్ని  ఎప్పటికప్పుడు పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రతి అభ్యర్థి ఫేస్‌బుక్‌లో లైక్‌ పేజీలను ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గస్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు బాధ్యులను నియమించి వారి ద్వారా సమాచారాన్ని ఓటర్లకు చేరవేస్తున్నారు. మరికొందరు పార్టీ అభిమానులు తమ అభ్యర్థిని గెలిపించాలని వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు. ప్రచారంలో తమ అభ్యర్థిత్వాన్ని  బలపర్చాల్సిన అవసరంతో పాటు ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. 

గ్రామానికో సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌
టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గ్రామానికో సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ను నియమించుకుంటున్నారు. గ్రామంలో చురుగ్గా ఉన్న యువకుడిని టెక్నాలజీ అనుభవం ఉన్న వ్యక్తిని నియమిస్తున్నారు. ఆ గ్రామంలో స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి మొబైల్‌ నెంబర్‌ను సేకరించి వాట్సాప్‌ గ్రూప్‌ తయారుచేస్తున్నారు. ఈ గ్రూపుల్లో తమ అభ్యర్థి ఎన్నికల ప్రచారం ఫొటోలు, సమాచారాన్ని పోస్ట్‌ చేస్తున్నారు. ఏ రోజు ఏ ఊరిలో ప్రచారం నిర్వహించేది సైతం ముందుగానే తెలుపుతున్నారు. ఫేస్‌బుక్‌లలో సైతం పోస్టులు పెడుతున్నారు. ఫేస్‌బుక్‌లలో లైవ్‌లను సైతం పెడుతున్నారు. ఇలా సోషల్‌ మీడియా ద్వారా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎల్‌ఈడీ స్క్రీన్ల  ద్వారా
ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా  ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను తెలుపుతూ దాదాపు 20 నుంచి 30 నిమిషాల విడిది వీడియోను రూపొందించారు. దీనిని గ్రామగ్రామాన సాయంత్రం సమయంలో ప్రజలు ఎక్కువగా ఉండే స్థలాల్లో ఏర్పాటుచేస్తున్నారు. డీసీఎంకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. మోబైల్‌ ఎల్‌ఈడీ ద్వారా రోజు రెండు గ్రామాల చొప్పున వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.  

Advertisement
Advertisement